Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
Kalvakuntla Kavitha In Delhi Liquor Policy Case | ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో 23 మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దిగువ కోర్టు తీర్పును సీబీఐ హైకోర్టులో ఛాలెంజ్ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత సహా 23 మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు ఊరట కలిగిస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ (CBI) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా వాదనలు వినిపించారు.
హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ
ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితతో పాటు మొత్తం 23 మందిపై సీబీఐ అభియోగాలను డిశ్ఛార్జ్ చేస్తూ వారికి ఊరట కలిగించడం తెలిసిందే. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితులకు అనుకూలంగా రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా నిందితులపై ఉన్న అభియోగాలను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, కింది కోర్టు నిర్ణయంపై స్టే ఇవ్వాలని సీబీఐ కోరింది. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు, నిందితులు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు
ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ స్కాం కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లలోని కొన్ని అంశాలపై స్పష్టత లేదని, సాక్ష్యాధారాల సేకరణలో జాప్యం జరుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. కొందరు నిందితులు తమపై ఉన్న కేసులను కొట్టివేయాలని (డిశ్చార్జ్) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు సానుకూలంగా స్పందించింది. కేవలం ఆరోపణలతో కేసు దర్యాప్తు జరిగిందని, తగినన్ని ప్రాథమిక ఆధారాలు లేకుండా నిందితులను ఎక్కువ కాలం జైల్లో ఉంచడం లేదా విచారణను సాగదీయడం సరికాదని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే 23 మంది నిందితులపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ వారి లిక్కర్ పాలసీ కేసు నుంచి విముక్తి కల్పించింది.
ఇంకా సాగుతున్న విచారణ
సీబీఐ ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేస్తోంది. ఆప్ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ పాలసీ స్కామ్‌లో భారీగా ముడుపులు చేతులు మారాయని, దీని వెనుక ఉన్న 'సౌత్ గ్రూప్', ఇతర రాజకీయ నేతల ప్రమేయాన్ని నిరూపించడానికి మరింత లోతుగా దర్యాప్తు జరగాలని సీబీఐ వాదిస్తోంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 16కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.
ట్రెండింగ్ వార్తలు
























