Supreme Court : టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Supreme Court :'వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్రానికి అనేక ప్రశ్నలు సుప్రీంకోర్టు సంధించింది. ప్రస్తుతానికి బోర్డులో ముస్లిం సభ్యులు మాత్రమే ఉండాలి' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Supreme Court : కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. కొన్ని అంశాలపై అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడింది. జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన అధికారులపై అస్పష్టత ఉందని పేర్కొంది.
వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, కొత్త చట్టంలోని చాలా రూల్స్‌పై ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా వినియోగదారుల ఆస్తుల ద్వారా వక్ఫ్‌కు సంబంధించిన నిబంధనలపై కేంద్రాన్ని నిలదీసింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను చేర్చే నిబంధనపై కూడా కోర్టు ప్రశ్నించింది. ముస్లింలను హిందూ బోర్డులో భాగం కావడానికి అనుమతిస్తుందా అని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది.
వక్ఫ్ బోర్డులో ఎక్స్-అఫిషియో సభ్యులు కాకుండా ముస్లిం సభ్యులు మాత్రమే ఉండాలని కోర్టు కామెంట్ చేసింది. దీనిని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు. ఈ పిటిష్లపై గురువారం (ఏప్రిల్ 17, 2025) మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ విచారణకు జరగనుంది.
ఈ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ చాలా పిటిషన్లు వచ్చినందున విచారణ ప్రారంభంలోనే ప్రధాన న్యాయమూర్తి పిటిషనర్లకు కీలకాంశాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్లు ఏ అంశాలను వాదించాలనుకుంటున్నారని? పిటిషనర్లలో ఒకరి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, కొత్త చట్టంలోని అనేక నిబంధనలు ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నాయని అన్నారు.
వక్ఫ్ సవరణ చట్టం 2025 పై విచారణ సందర్భంగా, హిందూ ట్రస్ట్ బోర్డులో హిందువులు కాని సభ్యులు ఉన్నారా అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. అందులో హిందూయేతరులు సభ్యులుగా ఉన్నారా అని క్వశ్చన్ చేసింది. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడంపై పిటిషనర్ల అభ్యంతరానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ ప్రశ్న అడిగింది.





















