Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
Nellore Mayor Resigns | అవిశ్వాసం తీర్మానం నేపథ్యంలో నెల్లూరు మేయర్ పదవికి స్రవంతి జయవర్ధన్ రాజీనామా చేశారు. జిల్లా కలెక్టర్‌కు తన రాజీనామా లేఖను వాట్సాప్ ద్వారా పంపడం హాట్ టాపిక్ అవుతోంది.

Nellore Mayor Resigns Via WhatsApp | నెల్లూరు: నెల్లూరు రాజకీయాలు వేడెక్కాయి. నెల్లూరు మేయర్ పదవిపై టీడీపీ వర్సెస్ వైసీపీ పోరు కొనసాగుతుండగా నెల్లూరు మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి శనివారం రాజీనామా చేశారు. రాజీనామా విషయాన్ని ఆమె శనివారం ప్రకటించడం తెలిసిందే. ఆదివారం ఉదయం స్వయంగా జిల్లా కలెక్టరేట్‌కు రాజీనామా లేఖను అందిస్తానని పొట్లూరు స్రవంతి చెప్పారు. కానీ నెల్లూరు కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వాట్సప్ ద్వారా నెల్లూరు మేయర్ స్రవంతి తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్‌కు పంపారు.
త్వరలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం
ఈ నెల 18న నగరపాలక సంస్థలో నెల్లూరు మేయర్ పై అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనుంది. ఈ క్రమంలో మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి రాజీనామా చేశారు. అయితే నేరుగా కలిసి రాజీనామా లేఖ ఇవ్వకుండా వాట్సప్ ద్వారా పంపడంతో జిల్లా కలెక్టర్ నెల్లూరు మేయర్ రాజీనామా లేఖను ఆమోదిస్తారా లేదా అని జిల్లాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 మంది కార్పొరేటర్ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో మొత్తం వైసీపీ నేతలు కార్పొరేటర్లుగా విజయం సాధించారు. వీరిలో ఒకరు రాజీనామా చేయగా, మిగిలిన 53 మందిలో ఏకంగా 42 మంది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) తర్వాత కూటమిలోని తెలుగుదేశం పార్టీలో చేరారు. మేయర్ స్రవంతితో కలిపి కేవలం 9 మంది మాత్రమే వైసీపీ బలం. డిసెంబర్ 18న మేయర్ పై అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయే అవకాశం ఉండటంతో వైసీపీ నేత స్రవంతి మేయర్ పదవికి రాజీనామా చేశారు. మరో నాలుగు రోజుల్లో నెల్లూరు మేయర్ పదవికి ఎన్నిక జరగనుంది. టీడీపీకి సంఖ్యా బలం ఉండటంతో అధిష్టానం నిర్ణయించే వారికి నెల్లూరు మేయర్ పదవి దక్కుతుంది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సపోర్టుతో మేయర్ పదవి..
స్రవంతి భర్త జయవర్దన్ విద్యార్థి నాయకుడిగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు జయవర్దన్. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ గెలుపులో తనవంతు పాత్ర పోషంచారు జయవర్ధన్. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు కావడం వీరికి ప్లస్ అయిది. పోలింగ్ ఎదుర్కోకుండానే స్రవంతి ఏకగ్రీవంగా గెలుపొందారు. తరువాత నెల్లూరు మేయర్ పీఠం కైవసం చేసుకుంటున్నారు. కానీ సార్వత్రిక ఎన్నికల తరువాత నెల్లూరు పాలిటిక్స్ మారాయి. వైసీపీ నుంచి 42 మంది టీడీపీలో చేరగా స్రవంతి మేయర్ పదవి కోల్పోయారు.






















