Buddha Venkanna on Pinnelli Brothers: పిన్నెల్లి లాంటి రౌడీ షీటర్లను తరిమి కొట్టాలి, జగన్ ను అడ్రస్ లేకుండా చేయాలి!
Pinnelli Ramakrishna Redy | మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ లేకపోతే.. అక్కడి ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లు అని, అలాంటి రౌడీషీటర్లను తరిమికొట్టాలని ప్రజలకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు.

Palnadu Politics | విజయవాడ: మున్సిపల్ చైర్మన్ పదవి కోసం వేలంపాట పెట్టి, దాడులు మరియు హత్యలకు పాల్పడిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులు అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తీవ్రంగా విమర్శించారు. వారికి నాయకత్వం వహించిన రాక్షసుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని, ఈ రాక్షసులందరూ కలిసి రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలను అరెస్టు చేస్తే, దానిని తప్పు, అన్యాయం అని మాజీ సీఎం జగన్ మాట్లాడడం సమంజసం కాదన్నారు.
రాష్ట్రంలో టీడీపీ మద్దతుదారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని, ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని బూతులు మాట్లాడిన చరిత్ర వారిదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సామాజికవర్గం పైనా దుర్మార్గాలకు తెగబడ్డారని, తమపై దాడులు చేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని తెలిపారు. 'జై వైసీపీ' అనలేదని పీక కోసి చంపిన ఘటనలు ఉన్నాయని, చనిపోవడానికి సిద్ధమైన చంద్రయ్య 'జై టీడీపీ' అని ప్రాణాలు విడిచారని, అది తమ బడుగు బలహీన వర్గాలకు టీడీపీపై ఉన్న కమిట్‌మెంట్ అని స్పష్టం చేశారు.
దారుణాలు చేసిన వారికి పరామర్శలు, సంఘీభావమా..
పిన్నెల్లి సోదరులు దుర్మార్గాలు చేసి అరెస్టు అయితే, జగన్ వారిని పరామర్శించాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇవ్వడం, వారికి సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించడం వంటి చర్యలు చూస్తుంటే జగన్ నైజం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోవాలని వెంకన్న సూచించారు. ఇద్దరు వ్యక్తులను అత్యంత కిరాతకంగా చంపిన వారిని అరెస్టు చేస్తే, దుర్మార్గులకు జగన్ సంఘీభావం ప్రకటించడం సరికాదని అన్నారు. ఈ రాష్ట్రంలో జగన్ నాయకత్వాన్ని బలపరచడం అంటే, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినట్లేనని, బిర్యానీ ప్యాకెట్లు, డబ్బులకు లొంగిపోయి ప్రజలు తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని కోరారు. వారి సమావేశాలకు, యాత్రలకు డబ్బులు ఇస్తున్నారని వెళ్లవద్దని కోరారు.
ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రం గాడిలో పడుతోందని, మోడీ సహకారంతో చంద్రబాబు బాగా పని చేస్తున్నారని బుద్ధా వెంకన్న. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లు ఈ రాష్ట్రం బాగు కోసం నిత్యం కృషిచేస్తున్నారని, రుషులు యాగం చేస్తుంటే రాక్షసులు నాశనం చేసినట్లుగా, చంద్రబాబు రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే జగన్ అనే రాక్షసుడు అడ్డంకులు కలిగిస్తున్నాడని విమర్శించారు. జగన్‌కు మతి భ్రమించిందని, మాజీ సీఎంగా ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు సోయి లేదని ఎద్దేవా చేశారు. మాచర్లలో పిన్నెల్లి సోదరులు లేకపోతే అక్కడి ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లు అవుతుందని, వారి వల్ల అక్కడ ఎవరికీ మనశ్శాంతి లేదని, అటువంటి రౌడీలకు జగన్ సంఘీభావం తెలుపుతున్నాడని దుయ్యబట్టారు. వారి అరాచకాలు భరించలేక గతంలో 11 సీట్లు ఇచ్చారని, ఈసారి ఒక్క సీటే దిక్కు అవుతుందని జోస్యం చెప్పారు.
తన జిల్లాలో కొడాలి నాని, పేర్ని నాని వంటి నాయకులు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, వీరు ఆరు నెలలకు కోలుకుని జగన్ పక్కన చేరేలోపు జగన్ పరిస్థితి ఏమిటో ఆలోచన చేయాలని అన్నారు. జగన్ పాలన పోయిన తర్వాత ప్రజలు దీపావళి చేసుకున్నారని, ఇప్పుడు జగన్ రెడ్డికి 11 పోయి ఒక్క సీటు మిగలడం ఖాయమని, పిన్నెల్లి వంటి రౌడీ షీటర్లు, దుర్మార్గులను ప్రజలు తరిమి కొట్టాలని, అటువంటి వారిని కాపాడుతున్న జగన్ ను, ఆ పార్టీని అడ్రస్ లేకుండా చేయాలని బుద్ధా వెంకన్న పిలుపునిచ్చారు.
పిన్నెల్లి సోదరుల అరెస్ట్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలపై మాచర్లలో ఎన్నికల సందర్భంగా ఈవీఎం ధ్వంసం చేయడం, హత్యాయత్నం, దాడులు వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసుల విషయంలో వారికి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించినప్పటికీ, కొన్ని షరతులను పాటించడంలో విఫలమవడంతో పాటు, హైకోర్టు ఆదేశాల మేరకు వారికి ముందస్తు బెయిల్ తిరస్కరించింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, జూన్ 2024 రెండవ వారంలో పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ మీద బయటకొచ్చిన వీరిని జంట హత్యలు జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, జవ్విశెట్టి కోటేశ్వరరావు కేసులో రెండు వారాల్లోకా లొంగిపోవాలని నవంబర్ 28న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పిన్నెల్లి సోదరులు గురువారం (డిసెంబర్ 11న) మాచర్ల కోర్టులో లొంగిపోయారు. మేజిస్ట్రేట్ వారికి 14 రోజుల రిమాండ్ విధించగా నెల్లూరు సెంట్రల్ జైలుకు వారిని తరలించారు. మద్దతుగా మాట్లాడడం, పార్టీ నేతలకు పరామర్శించాలని ఆదేశించడం వంటి చర్యలు తీసుకున్నారు. దీనిపైనే బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు.






















