Shocking News: పాఠాలు వింటూ కుప్పకూలిన విద్యార్ధిని.. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విషాదం
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తరగతి గదిలో బెంచ్ పై కూర్చుని పాఠాలు వింటున్న బాలిక ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందడం పెను విషాదాన్ని నింపింది..

Konaseema Latest News | గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.. ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఉన్న పళంగా కుప్పకూలి మరణిస్తున్నవారి సంఖ్య నానాటికీ ఎక్కవువుతోంది.. కారోనా విపత్తు తరువాత ఈ తరహా మరణాలు మరింత ఎక్కవయ్యాయనే చెప్పవచ్చు.. డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించిన వారిలో ముఖ్యంగా యువతీ యువకులు ఉండడం దిగ్భ్రాంతికి కలిగిస్తుండగా మరికొన్ని సంఘటనల్లో పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని పిల్లలు కూడా ఈ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మరణించడం మరింత ఆందోళన కరంగా మారింది.. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తరగతి గదిలో బెంచ్ పై కూర్చుని పాఠాలు వింటున్న బాలిక ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందడం పెను విషాదాన్ని నింపింది..
క్లాస్ రూమ్‌లోనే కుప్పకూలిన విద్యార్ధిని సిరి..
రామచంద్రపురం నియోజకవర్గంలోని పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి (14) రామచంద్రపురంలో ఓ ప్రయివేటు స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. శనివారం రోజూ మాదిరిగానే ఉదయం స్కూల్‌కు వెళ్లిన సిరి తోటి విద్యార్థులతో సరదాగానే గడిపింది.. క్లాస్ రూమ్‌లో టీచర్ పాఠాలు చెబుతుండగా బెంచ్‌పై కూర్చుని శ్రద్ధగా పాఠాలు వింటున్న విద్యార్ధిని సిరి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది.. ఏం జరిగిందో తెలియని టీచర్, తోటి విద్యార్థులు పైకి లేపి చూశారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన విద్యార్ధిని సిరిని హుటాహుటీన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే సిరి మృతిచెందినట్లు వైద్యులు దృవీకరించారు. విద్యార్ధిని నల్లమిల్లి సిరి గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కుమార్తె మృతితో తల్లి తండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.
ఆందోళన కలిగిస్తోన్న గుండెపోటు మరణాలు..
ఉన్న ఫళంగా కుప్పకూలి మృతిచెందిన సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి..దీనికి కార్డియాక్ అరెస్ట్ కారణమని వైద్యులు చెబుతున్నారు. గుండె నాళాల్లో ఇబ్బందులు తదితర సమస్యలుతో గుండెకు సరిపడిన రక్త ప్రసరణ జరగక కార్డియాక్ అరెస్ట్ అవుతున్న సంఘటనలు ఎక్కవుగా కనిపిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఫంక్షన్లలో డ్యాన్సులు వేస్తూ యువతీ యువకులు కుప్పకూలి మృతిచెందుతుండగా రామచంద్రపురంలో పదోతరగతి బాలిక ఇలా గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందడం మరింత ఆందోళన కలిగిస్తోందంటున్నారు..





















