Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల జట్టు కెప్టెన్ దీపిక, సభ్యురాలు పాంగి కరుణ కుమారి కుటుంబాలకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీవీ, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, నూతన వస్త్రాలు, దుప్పట్లు పంపించారు.

ఎవరు తమ సమస్య చెప్పుకున్నా వినడం, వెంటనే స్పందించి వీలైతే తక్షణ పరిష్కారం చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంధుల క్రికెట్‌లో ప్రపంచ విజేతలుగా నిలిచిన మహిళా జట్టు సభ్యులను కలిసిన సందర్భంలో వారి కుటుంబాల స్థితిగతులను తెలుసుకుని ఆయన చలించిపోయారు. మ్యాచ్ ఫీజుతోనే తమ కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామని జట్టు కెప్టెన్ దీపిక చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ స్పందించారు. సత్యసాయి జిల్లాకు చెందిన దీపిక, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణ కుమారి కుటుంబాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబాలకు తక్షణ ఆర్థిక, వస్తు సహాయం అందించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

క్రికెటర్ల కుటుంబాలకు ఉపకరణాలు, నిత్యావసరాల పంపిణీ
పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు, సత్యసాయి జిల్లాలోని తంబలహట్టి తండాలో దీపిక కుటుంబానికి, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వంట్లమామిడిలో కరుణ కుమారి కుటుంబానికి నిత్యావసరాలను, గృహోపకరణాలను అందించారు. ఇందులో టీవీ, టేబుల్ ఫ్యాన్, మిక్సర్ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేట్లు, ప్రెషర్ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టె, ఎల్‌ఈడీ బల్బులు, పాత్రలు, దుప్పట్లు, దిండ్లు, కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు, నిత్యావసర సరకులు ఉన్నాయి.

కెప్టెన్ దీపిక కుటుంబానికి అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఛైర్మన్ టి.సి. వరుణ్, పొదిలి బాబూరావు, కుమ్మరి నాగేంద్ర, ఆకుల ఉమేశ్, అంకె ఈశ్వరయ్య, డి.మణిప్రియ, శ్రీదేవి, ఆనంద్ తదితర జనసేన నేతలు తంబలహట్టి తండాకు వెళ్లి పవన్ కళ్యాణ్ పంపిన వస్తు సామాగ్రిని అందజేశారు. అదేవిధంగా, పాడేరు ఘాట్ రోడ్డులోని వంట్లమామిడి గిరిజన గ్రామంలో నివసిస్తున్న కరుణకుమారి కుటుంబానికి రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ వంపూరు గంగులయ్య, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్, జనసేన నేతలు పి.శివ ప్రసాద్, కె.రామారావు, ఎన్ మురళీకృష్ణ చేతుల మీదుగా ఈ వస్తువులను అందించారు.

తక్షణమే రోడ్ల మంజూరుకు ఆదేశాలు
పవన్ కళ్యాణ్‌ను కలిసిన సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం దీపిక మాట్లాడుతూ, మడకశిర నియోజకవర్గం పరిధిలోని తమ ఊరికి వెళ్లే రెండు రహదారులు ప్రయాణానికి యోగ్యంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఆమె మాటలు విన్న పవన్ కళ్యాణ్ వెంటనే ఆ రెండు రహదారులను మంజూరు చేయాలని సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు వేగంగా స్పందించారు. వారు హేమవతి పంచాయతీ పరిధిలోని తంబలహట్టి తండా రోడ్లను పరిశీలించారు. హేమవతికి వెళ్లే రహదారికి రూ. 3.2 కోట్లు, గున్నేహళ్లికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ. 3 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు. ఈ రెండు రోడ్ల నిర్మాణానికి సత్యసాయి జిల్లా కలెక్టర్ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు.
24 గంటల్లో ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణంపై హామీ
దీపిక, కరుణ కుమారి వేదనకు చలించిపోయిన పవన్ కళ్యాణ్ వారి కుటుంబాలకు గృహోపకరణాలు, నిత్యావసరాలను తక్షణమే సమకూర్చాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు వాటిని కొనుగోలు చేసి 24 గంటల్లోగా ఆయా కుటుంబాలకు పంపించారు. అంతేకాకుండా, ఇద్దరు తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతన గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటికి తగిన విధంగా డైనింగ్ టేబుళ్లు, మంచాలు వంటి మరికొన్ని గృహోపకరణాలు సమకూర్చాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు.






















