Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
Telangana:ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ చేస్తోందని కేంద్రానికి రేవంత్ ఉత్తమ్ ఫిర్యాదు చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.

Revanth And Uttam In Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జలవనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. గోదావరి జలాలను మూసీ నదికి అనుసంధించాలని మొన్నే ప్రధానిని కోరామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడున్న నీటి కేటాయింపులు, నీటి వినియోగం గురించే ప్రధానంగా చర్చించామన్నారు. తెలంగాణకు హక్కు ఉన్న నికర జలాలపై సమ్మక సారక్క ప్రాజెక్టు, సీతారామ తదితర ప్రాజెక్టులు కడుతున్నామని.. కానీ మా శాశ్వత కేటాయింపుల్లోని ప్రాజెక్టులపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు.
బనకచర్లకు అనుమతి ఇచ్చే ముందు నికరజలాల సంగతి తేల్చాల్సిందే
గోదావరి వరద జలాలపై కట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే ముందుగా నికర జలాల ప్రాజెక్టుల లెక్క తేల్చాల్సిందేనని.. సముద్రంలో వృధాగా కలిసే వరద జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ చెబుతోందన్నారు. అలాంటప్పుడు నికర జలాలపై ఉన్న మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యతరం చెబుతోందని సీఎం రేవంత్ ప్రశ్నించారు. వరద జలాలపై కట్టిన ఆయకట్టును స్థిరీకరిస్తే.. ఆ మేరకు నీటి కేటాయింపులు జరుపుతామని అంటున్నారని... కృష్ణా జలాలపై కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఆయకట్టు లెక్కల ప్రకారమే తెలంగాణకు తాత్కాలిక వాటా తగ్గిందన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు ఉపసంహరించుకోవాలి
కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల 811 టీఎంసీల ఉమ్మడి వాటాలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటోందని.. తెలంగాణ కేవలం 299 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంటోందని తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఏపీలో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం వల్లనేనని తెలిపారు. కృష్ణా నదిలో తలెత్తిన పరిస్థితి గోదావరి విషయంలో జరగకూడదని.. నికర జలాలపై మా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే వరద జలాలపై నిర్మించే ప్రాజెక్టుల సంగతి చూడాలన్నారు. మా నికర జలాలపై నిర్మించే ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ పెట్టిన అభ్యంతరాలు ఉపసంహరించుకోవాలని రేవంత్ డిమాండ్ చేశాు. వరద జలాలపై వారు నిర్మించే ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటుంది. మాకు స్పష్టత ఉందన్నారు.
కృష్ణా జిలాల వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని కోరిన ఉత్తమ్
కృష్ణా నదిలో శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఇతర ప్రాజెక్టులలో టెలీ మెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని జలవనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ ్చేశారు. పదేళ్లపాటు గతంలో తెలంగాణలో ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అవసరమైతే తెలంగాణ, ఆంధ్రా వాటా ఖర్చు కూడా మేమే భరిస్తామని చెప్పామమని.. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి తెలంగాణకు 50 ఏళ్ల పాటు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణం ఇవ్వాలని కోరామని.. NDSA - నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ నుంచి మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులపై నివేదిక త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణ జల వనరుల విషయంలో సీఎం రేవంత్, నేను కేంద్రం వద్ద మా వాదన బలంగా వినిపించాంమని.. కృష్ణా జలాల వివాదంలో రోజువారీగా కేంద్రం జోక్యం చేసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. దీర్ఘకాలికంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ త్వరితగతిన విచారణ పూర్తిచేయాలని కోరామని ఉత్తమ్ తెలిపారు.





















