Uttarandhra Teachers Mlc: కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
Teacher MLC: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూకు చెందిన గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. ఆయనకు ఏపీటీఎఫ్ అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చారు.

Gade Srinivasulu Teacher MLC: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ సంఘానికి చెందిన గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యతా ఓట్లలో విజయానికి కావాల్సిన ఓట్లు ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ లెక్కింపులో గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. టీటర్ల తీర్పును శిరసావహిస్తానని ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ప్రకటించారు. రఘువర్మకు కూటమి పార్టీలు మద్దతిచ్చాయి. అయితే టీచర్ సంఘాల్లో పీఆర్టీయూకు ఉన్న పట్టు.. కారణంగా గాదె శ్రీనివాసులనే విజయం వరించింది.
టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణంగా ఉపాధ్యాయ సంఘాల మద్య పోరుగా జరుగుతూ ఉంటాయి. ఉపాధ్యాయ సంఘాల్లో కీలకంగా ఉండే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, ఏపీటీఎఫ్.. పీఆర్టీయూ, పీడీఎప్ వంటి సంఘాలు తమ అభ్యర్థులు నిలబెడుతూ ఉంటాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేసేది. రెండు చోట్ల విజయం సాధించింది కూడా. అయితే ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో పోటీ చేయలేదు. కూటమి పార్టీలు కూడా పోటీ చేయలేదు. అయితే ఏపీటీఎఫ్ అభ్యర్థిగా నిలబడిన పాకలపాటి రఘువర్మకు మద్దతు ఇచ్చారు.
రఘువర్మతో పాటు పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలో ఉన్న కోరెడ్ల విజయగౌరి కూడా భారీగా ఓట్లు పొందడంతో.. పాకలపాటి రఘువర్మకు నష్టం జరిగింది. అయితే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు కూడాడ పెద్దగా రఘువర్మకు పోల్ కాలేదు. ఈ కారణంగా ఆయన ఓటమి పాలయ్యారు. యాభై శాతం ఓట్లు పొందకపోయినా ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతూండగానే ఓటమి ఒప్పుకుని పాకలపాటి రఘువర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
టీచర్స్ ఎమ్మెల్సీతో పాటు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోటీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రెండు రౌండ్లు ముగిసే సరికి ఇరవై వేల ఓట్లకుపైగా ఆధిక్యం సాధించారు. ఆయన మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కౌంటింగ్ ఆలస్యం అవుతోంది. రాత్రి తర్వాత మొదటి రౌండ్ పలితం వచ్చే అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎన్నికలు కావడంతో.. కౌంటింగ్ ఆలస్యం అవుతోంది. రేపు మధ్యాహ్నం వరకూ పట్టభద్రుల స్థానాల్లో కౌంటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
తెలంగాణలోనూ రెండు టీచర్ ఎమ్మెల్సీలు.. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కౌంటింగ్ జరుగుతోంది. టీచర్ ఎమ్మెల్సీల్లో ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి కొమురయ్య.. మరో స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ కూడా పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ ఆలస్యంగా జరుగుతోంది. ట్రెండ్స్ తెలియాల్సి ఉంది.





















