Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతుభరోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు ఈ నెల 22వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ నేరుగా కార్యక్రమంలో పాల్గొనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో 'రైతు భరోసా' నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నిధుల విడుదలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
మూడు విడతల్లో నిధుల జమ: ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తి
రైతు భరోసా పథకం అమలులో భాగంగా, మొదటి విడతగా ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి దశలో ఒక ఎకరం వరకు భూమి ఉన్న దాదాపు 70 లక్షల మంది రైతులకు రూ.3,590 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తారు. ఆ తర్వాత మరో 20 రోజుల వ్యవధిలో రెండో విడతగా రూ.2,650 కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మిగిలిన రైతులందరికీ రైతు భరోసా నిధులు అందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
తెలంగాణ అన్నదాతలకు శుభవార్త. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా నిధులు విడుదలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి… pic.twitter.com/AEDmUTQIjt
— Telangana CMO (@TelanganaCMO) March 15, 2026
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితర అధికారులు పాల్గొని నిధుల విడుదల ప్రక్రియను పర్యవేక్షించారు. వ్యవసాయ పనుల సమయంలో ఈ నిధులు అందడం రైతులకు ఎంతో ఊరటనివ్వనుంది.
ట్రెండింగ్ వార్తలు






















