Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Revanth Reddy vs KTR: సోషల్ మీడియాలో బిఆర్ఎస్ జోరు సాధిస్తుంటే, రేవంత్ ప్రత్యక్షంగా మైదానంలో దూసుకెళ్తున్నారు. క్షుద్ర పూజల ఆరోపణలు, పొలిటికల్ మాస్ పంచ్‌లతో రేవంత్ స్ట్రాటజీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది?

BRS Social Media Strategy Vs Congress Social Media Weakness: తెలంగాణ రాజకీయాల్లో ప్రచార వ్యూహాలు రోజురోజుకూ సరికొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ స్పేస్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వేదికగా చేసుకుని ప్రభుత్వంపై నిరంతర దాడి జరుపుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గ్రౌండ్ రియాలిటీ'కే మొగ్గు చూపుతున్నారు. నెటిజన్లను ఆకట్టుకోవడం కంటే ప్రత్యక్షంగా ప్రజల్లో ఉండటమే రాజకీయంగా బలమైన ముద్ర వేస్తుందనే నమ్మకంతో, వారంలో రెండు మూడు బహిరంగ సభలు, జిల్లాల పర్యటనలతో రేవంత్ రెడ్డి ప్రజాబాహుళ్యంలో దూసుకెళ్తున్నారు.
డిజిటల్ మీడియాలో కాంగ్రెస్ బలహీనం
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో బలమైన సోషల్ మీడియా ఈకో సిస్టమ్ లేకపోవడం ఒక స్పష్టమైన ప్రతికూలత. గత పదేళ్ల అధికారంలో బీఆర్ఎస్ నిర్మించుకున్న డిజిటల్ నెట్‌వర్క్, ట్రోలింగ్ , నరేటివ్ సెట్ చేసే వ్యూహాలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ పరిమితులు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఈ డిజిటల్ లోపాన్ని రేవంత్ రెడ్డి తన వన్ మ్యాన్ ఆర్మీ తరహా సుడిగాలి పర్యటనలు, మాస్ ప్రసంగాలతో భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే విమర్శలకు ఆన్‌లైన్‌లోనే బదులివ్వడం కంటే, ప్రజల్లోకి వెళ్ళి మైక్ పట్టుకుని గర్జించడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు.
మాస్ డైలాగ్స్‌తో బీఆర్ఎస్‌పై దాడి చేస్తున్న రేవంత్
రేవంత్ రెడ్డి ప్రసంగాలు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరణకే పరిమితం కావడం లేదు. ఆయన ఉపయోగిస్తున్న మాస్ పొలిటికల్ డైలాగ్స్ , సంచలనాత్మక వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని తీవ్రంగా వేడెక్కిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు అఘోరాలతో క్షుద్ర పూజలు చేయిస్తున్నారు , సొంత పార్టీ నేతల రక్తాన్ని కూడా అమ్ముకుంటున్నారు వంటి తీవ్రమైన, వివాదాస్పద ఆరోపణలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు మీడియాలో, యూట్యూబ్ ఛానెళ్లలో హైలైట్ అవ్వడం ద్వారా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ క్రియేట్ చేసే నరేటివ్‌ను ఒక్క దెబ్బతో తుడిచిపెట్టే వ్యూహం రేవంత్ ప్రసంగాల్లో కనిపిస్తుంది.
డిజిటల్ క్యాంపెయిన్‌లో దూసుకెళ్తున్న బీఆర్ఎస్
బిఆర్ఎస్ డిజిటల్ క్యాంపెయిన్ గ్రామీణ ప్రజల కంటే పట్టణ, విద్యాధికులైన ఓటర్లపై, యువతపై కొంత ప్రభావం చూపుతుంది. అయితే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రత్యక్ష రాజకీయాలు, నాయకుడి ఫిజికల్ ప్రెజెన్స్, మాస్ కనెక్టివిటీనే విజయావకాశాలను నిర్దేశిస్తాయి. రేవంత్ రెడ్డి సరిగ్గా ఈ పాయింట్‌నే క్యాచ్ చేశారు. సీఎం హోదాలో స్వయంగా వచ్చి మాట్లాడటం, ప్రతిపక్షాలపై నేరుగా విరుచుకుపడటం వల్ల క్షేత్రస్థాయి కార్యకర్తలలో ఉత్సాహం నిండటమే కాకుండా, సాధారణ ప్రజల్లో ప్రభుత్వం పనిచేస్తోందనే భావన బలంగా నాటుకుపోతుంది. రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ 'తీవ్ర వ్యాఖ్యల' వ్యూహంలో కొన్ని ముప్పులు కూడా ఉన్నాయి. నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు వంటి ప్రధాన అంశాలు పక్కదారి పట్టే ప్రమాదం ఉంది.
ఎవరిది పైచేయి?
అంతేకాకుండా, బీఆర్ఎస్ డిజిటల్ టీమ్ రేవంత్ మాట్లాడే ప్రతి మాస్ డైలాగ్‌ను కట్ చేసి, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నిస్తోంది. దీర్ఘకాలంలో కాంగ్రెస్ కూడా తన డిజిటల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోకపోతే, కేవలం సీఎం పర్యటనలపైనే ఆధారపడటం కష్టమవుతుంది. ప్రచార హోరాహోరీలో బీఆర్ఎస్ ఆన్-స్క్రీన్ ఆధిక్యత ప్రదర్శిస్తుంటే, రేవంత్ రెడ్డి ఆన్-గ్రౌండ్ ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. డిజిటల్ మీడియా ఇచ్చే పబ్లిసిటీ తాత్కాలికమైనదే అయినప్పటికీ, ప్రజల్లోకి వెళ్లి నేరుగా వేసే ముద్ర ఎన్నికల రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి బిఆర్ఎస్ డిజిటల్ దాడి కంటే, రేవంత్ రెడ్డి ప్రత్యక్ష మాస్ అటాక్, సుడిగాలి పర్యటనలే రాజకీయంగా ఎక్కువ మైలేజ్ ఇస్తున్నాయని చెప్పవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















