BJP New National Executive: నితిన్ నవీన్ టీంలో పురందేశ్వరి, రాంమాధవ్, విష్ణువర్థన్ రెడ్డి - తెలంగాణ నేతలకు దక్కని చోటు !
Nitin Nabin BJP Team: బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డికి కీలక పదవి! పురందేశ్వరి, రాంమాధవ్‌లకు జాతీయ ఉపాధ్యక్ష హోదాలు ఇచ్చారు. అయితే తెలంగాణ నేతలకు చోటు దక్కలేదు.

AP BJP Leaders Roles: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో పార్టీ కేంద్ర కార్యాలయం నూతన జాతీయ ఆఫీస్ బేరర్ల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. సంస్థాగత ప్రక్షాళన, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రకటించిన ఈ తాజా కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలకు బాధ్యతలు దక్కాయి. ఈ నియామకాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ నేత, పార్టీ వ్యాఖ్యాత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డికి లభించిన జాతీయ స్థాయి బాధ్యత కేంద్ర పార్టీ నాయకత్వంలో ఆయన ప్రాధాన్యతను చాటిచెబుతోంది.
ఈ నూతన కార్యవర్గంలో ఎంపీ విష్ణుదత్ శర్మ ఆల్ సెల్స్ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. ఏపీకి చెందిన బీజేపీ కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డికి ఆల్ సెల్స్ జాయింట్ కో-ఆర్డినేటర్ పదవిని కేటాయించారు. పార్టీకి చెందిన వివిధ అనుబంధ విభాగాలు, సెల్స్ ఉమ్మడి సమన్వయానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఆయనకు ఈ బాధ్యతను అప్పగించారు. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు బిహార్‌కు చెందిన రీతురాజ్ సిన్హా జాయింట్ కో-ఆర్డినేటర్‌గా ఉంటారు. సుదీర్ఘకాలంగా మీడియా వేదికలపై పార్టీ భావజాలాన్ని ధీటుగా వినిపిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి సేవలను గుర్తించి కేంద్ర నాయకత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.
నూతన కార్యవర్గంలో అత్యంత కీలకమైన జాతీయ ఉపాధ్యక్షులుగా ఇద్దరు సీనియర్ తెలుగు నేతలకు చోటు లభించింది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. ఆమెతో పాటు జాతీయ స్థాయి వ్యూహకర్తగా, గతంలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన రాంమాధవ్ కూడా జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. వసుంధర రాజే సింధియా, బైజయంత్ జయ్ పాండా వంటి దిగ్గజ సీనియర్లతో సమానంగా తెలుగు నాయకులకు ఉపాధ్యక్ష హోదా దక్కడం ద్వారా జాతీయ విధాన నిర్ణయాల్లో తెలుగు నేతల పాత్ర మరింత పెరగనుంది.
పార్టీ అత్యంత కీలకమైన సంస్థాగత విభాగంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ బాధ్యతల్లో బి.ఎల్. సంతోష్ యథావిధిగా కొనసాగుతుండగా, ఆయనకు సహాయకులుగా శివప్రకాష్, సౌదాన్ సింగ్ జాయింట్ జనరల్ సెక్రటరీలుగా నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లబ్ కుమార్ దేబ్, స్మృతి ఇరానీ, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలకు చోటు దక్కింది. సంస్థాగత అనుభవం ఉన్న నాయకులకు ఈ కీలక బాధ్యతలను అప్పగించడం ద్వారా రాబోయే ఎన్నికల వ్యూహాలను పదును పెట్టేందుకు బీజేపీ సిద్ధమైంది.
బిజేపీ జాతీయ కార్యవర్గంలో పురందేశ్వరి, రాంమాధవ్ వంటి సీనియర్లతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి వంటి యువ నాయకుడికి లభించిన గుర్తింపు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి జాతీయ స్థాయి అనుబంధ విభాగాల సమన్వయకర్తగా నియమితులు కావడం ద్వారా దక్షిణాదిలో పార్టీ విస్తరణకు, కేడర్‌ను సమాయత్తం చేయడానికి అనుభవజ్ఞులైన తెలుగు నేతల వాగ్దాటిని సమర్థవంతంగా వాడుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే తెలంగాణ నేతలకు చోటు దక్కలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















