Raksha Khadse: కేంద్ర మంత్రి కూతురుకు ఈవ్ టీజింగ్. మంత్రి కూతురు అని తెలిసినా వదలని పోకిరీలు.. పోక్సో కేసు పెట్టిన పోలీసులు
Raksha Khadse: కేంద్ర మంత్రి రక్షా ఖద్సే కుమార్తెను ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పోకిరీలు వేధించారు. దీనిపై మంత్రి స్వయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.

పబ్లిక్ ప్లేసుల్లో పోకిరీలు రెచ్చిపోతుండటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఏకంగా కేంద్ర మంత్రి కుమార్తెను వేధించిన ఘటన మహరాష్ట్రలోని జల్‌గావ్ Jalgaon లో జరిగింది. యువజన వ్యవహారాలు, స్పోర్ట్స్ కేంద్ర సహాయమంత్రి రక్షా ఖద్సే జలగావ్‌లోని ఓ గ్రామ జాతరకు వెళ్లినప్పుడు టీజింగ్ చేశారు.
ఫిర్యాదు చేసిన మంత్రి
తన కుమార్తెపై వేధింపులకు పాల్పడిన వారిపై కేంద్రమంత్రి రక్షా స్వయంగా ఫిర్యాదు చేశారు. జలగావ్‌లోని ముక్తై నగర్ పరిధిలోని కొథాలి గ్రామంలో సంత్ ముక్తై యాత్రలో పాల్గొనేందుకు మంత్రి కుమార్తె, ఆమె స్నేహితురాళ్లు వెళ్లారు. ఈ జాతరలో కొంతమంది పోకిరీలు మంత్రి కుమార్తెను కామెంట్లతో వేధించారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో గుజరాత్‌లో ఉన్న మంత్రి ఘటన గురించి తెలిసిన వెంటనే ముక్తై నగర్‌కు వచ్చారు. స్వయంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎఫ్.ఐఆర్‌లో ఏడుగురు పేర్లను చేర్చిన పోలీసులు ఇప్పటివరకూ ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కుమార్తె మైనర్ కావడంతో నిందితులపై భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్లతో పాటు Protection of Children from Sexual Offences (POCSO) Act, అలాగే వారి అనుమతి లేకుండ ఫోటోలు, వీడియోలు తీసినందుకు ITయాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు.
నిందితులకు రాజకీయ పలుకుబడి
మంత్రి కుమార్తెను వేధించిన వారిలో కొంతమందికి స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉంది. ఈ విషయాన్ని మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా చెప్పారు. అయితే నిందితులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసి తీరుతామని చెప్పారు. మొత్తం ఏడుగురిలో ఇప్పటివరకూ ఒక్కరినే అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారికోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
మా అమ్మాయి జాతరకు వెళతానని చెప్పినప్పుడు నేను గుజరాత్‌లో ఉన్నాను. మా ఇంట్లో ఉన్న పోలీసు గార్డ్‌తో పాటు.. ఇద్దరు ముగ్గురు స్టాఫ్ మెంబర్స్‌ను కూడా తీసుకెళ్లమని చెప్పాను. మా అమ్మాయి స్నేహితురాళ్లతో పాటు వాళ్లు కూడా ఉన్నారు. వారితో పోలీసు గార్డ్ ఉన్నప్పటికీ వీళ్లని దగ్గరగా ఫాలో చేయడంతో పాటు.. జనంలో నెట్టారు. వారి పోటోలు, వీడియోలు కూడా తీశారు. వారి వెంట ఉన్న గార్డ్ ప్రశ్నించినప్పటికీ దౌర్జన్యంగా ప్రవర్తించారు. అని మంత్రి చెప్పారు.
ఇప్పుడు మాత్రమే కాకుండా ఈ పోకిరీ బ్యాచ్ ప్రతిసారీ ఇలాగే చేస్తున్నారని.. ఇలాంటి సంఘటనే ఫిభ్రవరి 24న కూడా జరిగిందని.. అప్పుడు కూడా ఈ ఏడుగురు కుర్రాళ్లే పబ్లిక్‌లో మహిళలను వేధించారని తన కూతురు చెప్పినట్లు మంత్రి చెప్పారు. ఇది చాలా దురదుష్టకరం, ఒక ఎంపీ, కేంద్ర మంత్రి కూతరుకే ఇలా జరుగుతున్నప్పుడు ఇక మామూలు జనం పరిస్థితి ఏంటని ఊహించుకోవచ్చు అని రక్షా ఖద్సే ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని స్థానికులు చెప్పారని.. ఈ కుర్రాళ్లు లోకల్‌గా ఉండే స్కూల్ గర్ల్స్‌ను వేధిస్తున్నారని, దీనిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. నేను ఇవాళ ఓ తల్లిగా పోలీసు స్టేషన్‌కు వెళ్లాను. కేంద్రమంత్రిగా కాదు. నా కూతురు, తన స్నేహితురాళ్లకు జరిగిన ఘటన క్షమించరానిది. ఇలాంటి పరిస్థితిని వేరే తల్లులు ఎవరైనా ఫేస్ చేసినట్లైతే వాళ్లంతా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మహాశివరాత్రి జాతరకు వచ్చిన నా కూతురుపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. తన వెంట ఉన్న గార్డులను వేధించారు. అని ఆమె ANIకి చెప్పారు. పోలీసులు ఉన్నా అమ్మాయిలనను వేధిస్తూ వాళ్ల వీడియోలు తీస్తున్నారంటే వాళ్లకి ఎంత ధైర్యం..? కనీసం ౩౦-40మంది పోగై.. మా అమ్మాయి అసభ్యంగా ప్రవర్తించారు. వాళ్ల ఎవరింట్లోకైనా ఇలాగే వెళతారు. వాళ్లకి నచ్చినట్లు చేస్తారు. ఇలాంటి వారిపై కచ్చితంగా తీవ్రమైన చర్యలు ఉండాలి అన్నారు.
నిందితులందరిపై పోస్కో కేసు నమోదు చేసినట్లు ముక్తై నగర్ డీఎస్పీ కృష్ణట్ పింగాలే తెలిపారు. ఫిభ్రవరి 28వతేదీ రాత్రి, కొథాలి గ్రామంలో జరిగిన జాతరలో ముక్తైనగర్ కు చెందిన అనికేత్ ఘవై అతని స్నేహితులు ఆరుగురు కూడా పాల్గొన్నారు. అక్కడ వీళ్లు 3-4 అమ్మాయిను వేధించినట్లు ఫిర్యాదు అందింది, వీళ్లందరిపై POCSO ,IT యాక్ట్ సెక్షన్లు పెట్టాం.
రాజకీయ దుమారం
జరిగిన సంఘటన రాజకీయంగానూ మంటలు రేపింది. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితికి ఈ సంఘటన అద్దం పడుతోందని కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేన విమర్శించాయి. కేంద్ర మంత్రి కుమార్తెకే భద్రత లేనప్పుడు సాధారణ అమ్మాయిల పరిస్థితి ఏంటని మహరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి పోలీసు స్టేషన్లో కూర్చుని ఉంటే ఆమె కూతురుని వేధించిన వాళ్లు బయట తిరుగుతున్నారని కనీసం వాళ్లని పట్టుకోవడం కూడా మహాయుతి ప్రభుత్వానికి చేతకాలేదని విమర్శించారు. హోంశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉందని ఆయన కనీసం రాష్ట్రంలో శాంతిభద్రతలపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు.






















