iBomma: పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ కేసులో కొత్త ట్విస్ట్! రవి సినిమాలు పైరసీ చేయలేదని తేల్చిన పోలీసులు!
iBomma: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ప్రధాన నిందితుడు రవి వేలాది సినిమాలు పైరసీ చేశాడని అంతా అనుకుంటున్న వేళ అంతా తూచ్ అంటున్నారు పోలీసులు

iBomma: తెలుగు సినీ పరిశ్రమ ఆర్దిక మూలాలను దెబ్బకొట్టి పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఐదురోజుల పోలీసు కస్టడీలో సైతం నిందితుడు రవి వద్ద నుంచి కీలక సమాచారాన్ని తెలంగాణ పోలీసులు రాబట్టారు. మరి కొన్ని విషయాల్లో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. తాజా మరో వారం రోజులపాటు పోలీసు కస్టడీ కోరుతూ నాంపల్లికోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. తాజాగా నిందితుడు రవి ఏ సినిమాలు పైరసీ చేయలేదంటూ మరో బాంబు పేల్చారు పోలీసులు.
ఐబొమ్మ, బప్పం పైరసీ వెబ్ సైట్ల ద్వారా చట్టవిరుద్దంగా సినిమాలను పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచడంతోపాటు, ఆయా వెబ్ సైట్ల ద్వారా గేమింగ్ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించిన మాట వాస్తవమేనని, కానీ అప్పుడే విడుదలైన కొత్త సినిమాలను పైరసీ చేయడంలో ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవికి ఎటువంటి ప్రమేయం లేదని తేల్చినట్లు సమాచారం. మూవీ రూల్స్ , తమిళ్ ఎంవీ ద్వారా పైరసీ సినిమాలను కొనుగోలు మాత్రమే రవి చేసేవాడని, అలా కొనుగోలు చేసిన కొత్త సినిమాలు క్వాలిటీ తక్కువగా ఉండేవని, అలా పూర్ క్వాలిటీతో కొన్న పైరసీ సినిమాలను టెక్నాలజీ ఉపయోగించి, హెచ్ డీ క్వాలిటీలోకి మార్చి ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్‌లో పోస్ట్ చేసేవాడని తేల్చారు. దీంతో సినిమా పైరసీ కేసుల నుంచి ఐబొమ్మ రవికి కాస్త ఊరట లభించినట్లయ్యింది. కానీ గేమింగ్ యాప్‌లు ప్రమోట్ చేయడం, బెట్టింగ్ యాప్ లను తన వెబ్ సైట్ ల ద్వారా ప్రమోట్ చేయడం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించడంతో రవి అడ్డంగా బుక్కైనట్లయ్యింది.
పైరసీ సినిమాలు కొనకుండా ఐబొమ్మ ఎలా నడిపించేవాడంటే..
ఐబొమ్మ రవి పోలీసులకు చిక్కడానికి కారణం తన గొయ్యి తానే తవ్వుకోవడం. తన డొమైన్‌ను తన సొంత అడ్రస్, ఈమెయిల్ ఐడీ, క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేయడమే రవి ఈజీగా ఖాకీలకు చిక్కేలా చేసింది. మొదట ఎన్‌జలా అనే కంపెనీ ద్వారా డొమైన్ రిజస్ట్రేషన్ చేసిన రవి, ఐపీ వాల్యూమ్ అనే కంపెనీ ద్వారా హోస్టింగ్ వ్యవహారాలు మ్యానేజ్ చేసేవాడు. కంటెంట్ మ్యానేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఈ మొత్తం వ్యవస్దను నడిపించేందుకు ఔట్ సోర్సింగ్ టీమ్ ఏర్పాటు చేసినట్లుగా నిర్దారించారు. ఇలా వీళ్లెవరికీ రవితో సంబంధాలు లేవు. ఎవరెవరు, ఎక్కడి నుంచి ఎవరి కోసం పని చేస్తున్నారో తెలియకుండా ఈ మొత్తం వ్యవహారం నడిపించాడు.
ఐబొమ్మ వెబ్ సైట్‌లోకి వెళ్లి సినిమా లింక్‌పై క్లిక్ చేయగానే వెంటనే యూజర్స్ ను గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్‌లకు రీడైరెక్ట్ చేసేలా బప్పం, ఐబొమ్మ పైరసీ వెబ్ సైట్లను డిజైన్ చేశాడు. అలా యూజర్ ఎంగేజ్మెంట్ ఆధారంగా బెట్టింగ్, గేమింగ్ యాప్ కంపెనీలు రవికి డబ్బులు చెల్లించేవి. లక్ష వ్యూవర్స్‌కు ఇంత మొత్తంలో డబ్బు చెల్లించేలా ముందుగానే మాట్లడుకునేవాడు. అలా ఆయా కంపెనీల నుంచి వచ్చిన డబ్బును ఇండియాలో తన బ్యాంక్ అకౌంట్‌కు మళ్లించేవాడు. అలా వచ్చిన డబ్బును వచ్చినట్లు మంచినీళ్లలా విదేశీ పర్యటనల కోసం ఖర్చు చేసేవాడట. ఇలా పైరసీ సినిమాలు మాత్రమే కొనలేదుకానీ, మిగతా చట్టవిరుద్దమైన గేమింగ్ యాప్ ప్రమోషన్‌లతో కోట్లు దండుకోవడం నిందితుడి కొంపముంచింది.





















