Falcon MD Amardeep Arrest: డిజిటల్ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్ అరెస్ట్
డిజిటల్ డిపాజిట్ల పేరుతో ఫాల్కన్ సంస్థ రూ.850 కోట్ల మేర భారీ మోసాలకు పాల్పడింది. ఇదివరకే లుకౌట్ నోటీసులు జారీ కాగా, తాజాగా ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్‌ను అరెస్ట్ చేశారు.

Falcon MD Amardeep Arrest: హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారీ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ఫాల్కన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో సుమారు రూ.850 కోట్లను వసూలు చేసినట్లు అమర్‌దీప్‌పై ఆరోపణలు ఉన్నాయి. స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే నిందితుడు తన భార్యతో కలిసి దుబాయ్‌కు పరారయ్యాడు. దీంతో పోలీసులు అమర్‌దీప్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఆయన గల్ఫ్ దేశాల నుండి ముంబయి విమానాశ్రయానికి చేరుకోగానే, ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తెలంగాణ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐడీ బృందం ముంబైకి వెళ్లి అమర్‌దీప్‌ను ఆయన్ను అరెస్ట్ చేసింది.
పెట్టుబడుల పేరుతో మోసాలు
ఫాల్కన్ సంస్థ ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించి, షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సామాన్య ప్రజలను మభ్యపెట్టి భారీగా డిపాజిట్లు సేకరించింది. ఈ యాప్ ఆధారిత పెట్టుబడుల స్కామ్‌లో ఇప్పటికే సంస్థ సీఈవో అమర్‌దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయని నమ్మించి వందల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దారి మళ్లించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అమర్‌దీప్ అరెస్ట్‌తో ఈ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి.
లుకౌట్ నోటీసులు అంటే: నిందితులు దేశం విడిచి వెళ్లకుండా లేదా విదేశాల నుండి తిరిగి వచ్చేటప్పుడు విమానాశ్రయాల్లో గుర్తించడానికి దర్యాప్తు సంస్థలు జారీ చేసే నోటీసులు. పలు ముఖ్యమైన కేసుల్లో నిందితులపై ఇలా లుకౌట్ నోటీసులు జారీ చేస్తుంటారు.
యాప్ ఆధారిత మోసాలు: ఇటీవల కాలంలో ట్రేడింగ్ మోసాలు, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో నకిలీ యాప్‌లను సృష్టించి మోసాలకు పాల్పడే గ్యాంగ్ లు పెరిగిపోయాయి. ఇటువంటి స్కామ్‌ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. అధిక వడ్డీ పేరుతో సైతం మోసాలు జరుగుతుంటాయి. ఈ స్కామ్‌లో కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులు ఉన్నారు.






















