Revanth Reddy Vs Chandra babu: ఏపీలో చంద్రబాబుకు సమస్యలు సృష్టించిన రేవంత్ - వ్యూహాత్మకమేనా?
Revanth politics: చంద్రబాబును ఇబ్బందిపెట్టేలా రేవంత్ రాజకీయం ఎందుకు మారింది. తెలంగాణ సీఎం తన రాజకీయాలను మార్చేశారా?

Revanth politics in Andhra: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలి ఎప్పుడూ దూకుడుగా, వ్యూహాత్మకంగా ఉంటుంది. తాజాగా అసెంబ్లీలో ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించాయి. ఏపీలోనూ రాజకీయ ప్రపంకనలకు కారణం అయ్యాయి. రాయలసీమ లిఫ్ట్ పనులు జగన్ హయాంలోనే ఎన్‌జీటీ ఆదేశాలతో ఆగిపోయినప్పటికీ, రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అపాదిస్తూ చేసిన వ్యాఖ్యల వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబును ఇబ్బంది పెడుతున్న వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇరకాటం ప్రారంభమయింది. ఏపీలో బాబు రాయలసీమ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే సంకేతాన్ని పంపారు. ఇది రాయలసీమలో చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. తన రాజకీయ గురువు అని చెప్పుకునే చంద్రబాబుపైనే రేవంత్ ఇలాంటి అస్త్రాన్ని ప్రయోగించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వాస్తవ విరుద్ధంగా చేసిన ఈ వ్యాఖ్యలను వైసీపీ అస్త్రంగా చేసుకుంది.
తన వరకూ మేలు చేసుకుని చంద్రబాబును ముంచేశారా?
పదేళ్లు బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది మేమే అనే నినాదంతో అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ నినాదాన్ని తన సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కఠినంగా వ్యవహరిస్తున్నానని చెప్పుకోవడం ద్వారా తెలంగాణ ఓటర్లలో తన పట్ల నమ్మకాన్ని పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. అంటే, చంద్రబాబుతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాల దగ్గరకు వచ్చేసరికి రాజీ పడబోననే ఇమేజ్‌ను బిల్డ్ చేసుకునే ప్రయత్నం ఇది. కానీ ఇది ఓ అవాస్తవ అంశం మీద ఆధారపడి ఉండటమే టీడీపీకి ఇబ్బందికరంగా మారింది.
వైసీపీకి అయాచిత ఆయుధం
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వైసీపీ అందిపుచ్చుకుంది. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారని.. రేవంత్ వ్యాఖ్యలే సాక్ష్యమని ప్రచారం చేస్తున్నారు. తన వ్యాఖ్లు ఇలా ఏపీలో రివర్స్ అవుతాయని రేవంత్ కు ఈ విషయం తెలియక కాదు. జగన్ హయాంలో ప్రాజెక్టు ఆగిపోయిందనే విషయం రికార్డుల్లో ఉన్నా, చంద్రబాబు పేరును తెరపైకి తేవడం ద్వారా ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ పోరును మరింత తీవ్రతరం చేయాలనేది రేవంత్ ఆలోచన కావచ్చు. దీనివల్ల ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు రక్షణలో పడిపోతే, తెలంగాణ పాలిటిక్స్‌లో రేవంత్‌పై ఉన్న చంద్రబాబు శిష్యుడు అనే ముద్ర తొలిగిపోతుందని ప్లాన్ చేసిఉంటారని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు తరచూ రేవంత్ రెడ్డిని చంద్రబాబు ఏజెంట్ అని విమర్శిస్తుంటారు. రాయలసీమ ప్రాజెక్టు అంశాన్ని ఎత్తుకోవడం ద్వారా, తాను చంద్రబాబు మాట వినే వ్యక్తిని కాదని, అవసరమైతే ఆయన్నే ఇబ్బంది పెట్టే స్థాయికి చేరానని రేవంత్ నిరూపించుకున్నారని అనుకోవచ్చు. ఈ వ్యూహం రెండు రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సామరస్య సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంది.





















