IPL 2025 PBKS Twin Records: అటు ఛేజింగ్ అయినా, ఇటు డిఫెండ్ అయినా తగ్గేదెలే.. లీగ్ చరిత్రలో పంజాబ్ రికార్డుల మోత.. కేకేఆర్ పైనే ఈ రికార్డులు నమోదు
ఐపీఎల్లో పంజాబ్ తన ప్రత్యేకతను చాటుకుంది. అటు హయ్యెస్ట్ ఛేజింగ్ తోపాటు, ఇటు లోయెస్ట్ డిఫెండ్ స్కోరుతో రికార్డుల మోత మోగించింది. అయితే ఈ రెండు రికార్డులను కేకేఆర్ పైనే పంజాబ్ సాధించడం విశేషం.

IPL 2025 PBKS 111 Defend Score: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ మంగళవారం కమాల్ చేసింది. 111 పరుగులు చేసినా కూడా విజయం దక్కించుకుని ఔరా అనిపించింది. బంతికో పరుగు చేసిన ఇంకా 8 బంతులు మిగిలి ఉండే అతి చిన్న టార్గెట్ ను కూడా కాపాడుకుంది. ముఖ్యంగా చిన్న పాటి టార్గెట్ ను కాపాడుకోడానికి తన బౌలర్లను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వాడుకున్న తీరు, వారిలో ఉత్సాహాన్ని నింపిన తీరు మాటలకందనిది. ఇదే జట్టు అంతకముందు సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 245 పరుగుల టార్గెట్ ను కాపాడుకోలేక 8 వికెట్లతో ఓడిపోయింది. అయితే కోల్ కతా నైడ్ రైడర్స్ పై మాత్రం తమ జూలు విదిల్చింది. కేవలం 111 పరుగులను డిఫెండ్ చేసుకుని లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన జట్టుగా నిలిచింది. అయితే ఆశ్చర్యకరంగా కేకేఆర్ పైనే మరో రికార్డును కూడా పంజాబ్ కలిగి ఉంది.
From the ecstasy of chasing big 🔥
— IndianPremierLeague (@IPL) April 15, 2025
To the ecstasy of defending low 🛡️
The battle between these 2️⃣ teams is a rollercoaster you don’t want to miss 🎢#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/RPC7Kx5Aa6
హైయ్యెస్ట్ ఛేజింగ్..
ఐపీఎల్లోనే కాకుండా టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేదన రికార్డు కూడా పంజాబ్ పేరిటే ఉంది. గతేడాది కేకేఆర్ పై 262 పరుగులను ఛేజ్ చేసి రికార్డుల్లోకి ఎక్కింది. ఈ మ్యాచ్ ను తలుచుకుంటే క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ ఒళ్లు పులకరిస్తుంది. ఈ మ్యాచ్ కు ముందు కేవలం 8 మ్యాచ్ ల్లో రెండు విజయాలతో ఉన్న పంజాబ్.. కేకేఆర్ పై తన జూలు విదిల్చింది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫిల్ సాల్ట్ (75), సునీల్ నరైన్ (71) ఆకాశమే హద్దుగా చెలరేగారు. మరొక జట్టైతే ఈ భారీ స్కోరును చూసి బెంబేలెత్తిపోయేది. అయిత విజయమో, వీర స్వర్గమో అన్నట్లుగా చెలరేగిన పంజాబ్.. మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే, 8 వికెట్లతో ఈ టార్గెట్ ను ఛేజ్ చేసింది. ముఖ్యంగా జానీ బెయిర్ స్టో (108) సెంచరీతో కదం తొక్కగా, ప్రభు సిమ్రాన్ (54), శశాంక్ సింగ్ (68) విరోచిత ఫిఫ్టీలతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇక తాజా సీజన్ కు వచ్చే సరికి మరో రకంగా కేకేఆర్ కు పంజాబ్ చుక్కలు చూపించింది.
చాహల్ మాయాజాలం..
ఈ సీజన్ లో అంతంతమాత్రంగానే రాణించిన యుజ్వేంద్ర చాహల్.. ఈ మ్యాచ్ లో తన మాయను ప్రదర్శించాడు. గింగరాలు తిరిగే బంతులు వేసి, కేకేఆర్ కు చుక్కలు చూపించాడు. న్యూ చంఢీగడ్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ కేవలం 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్ (15 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లతో రాణించాడు. ఇక ఛేజింగ్ లో డిఫెండింగ్ చాంపియన్ కేకేఆర్ 15.1 ఓవర్లలో 95 పరుగులకు కుప్పకూలింది. మిడిలార్దర్ బ్యాటర్ అంగ్ క్రిష్ రఘువంశీ (37) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. యజ్వేంద్ చాహల్ నాలుగు, మార్కో యన్సెన్ మూడు వికెట్లతో రాణించారు. ఇక గతేడాది పంజాబ్ చేతిలో ఓడిన కేకేఆర్ కి కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ ఉండగా.. ఈ ఏడాది పంజాబ్ కెప్టెన్ గా శ్రేయస్ పగ్గాలు చేపట్టి, కేకేఆర్ పైనే మరుపురాని విక్టరీని సాధించడం కొసమెరుపు.




















