(Source: Poll of Polls)
Minister KTR: చేనేత, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు సరికాదు.... కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ... చేనేత రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం
చేనేత, టెక్స్ టైల్ పరిశ్రమలపై వచ్చే ఏడాది నుంచి జీఎస్టీ 12 శాతానికి పెంపుపై మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. పన్ను పెంపు ఈ పరిశ్రమలకు భారంగా మారుతుందన్నారు.
చేనేత, వస్త్ర పరిశ్రమపై జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు. ఇప్పటికే టెక్స్ టైల్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గత రెండు సంవత్సరాలుగా కరోనా సంక్షోభం వల్ల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని తెలిపారు. ఇలాంటి తరుణంలో జీఎస్టీ పన్ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచడంతో ఆ పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోతాయని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఉపాధిని కల్పించే టెక్స్ టైల్, చేనేత రంగానికి ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాలని కానీ ఇలాంటి నిర్ణయం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా చేనేత ఉత్పత్తులపై పన్ను లేదని అయితే కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ ద్వారా తొలిసారి 5 శాతం పన్ను విధించిందని గుర్తుచేశారు. చేనేత రంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడు మరో 7 శాతం అదనపు GST ని వేయడంతో చేనేత రంగం పూర్తిగా కుదేలై పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: తెలంగాణలో తొలి ‘గే’ వివాహం.. మంగళ స్నానాలు, సంగీత్ అన్నీ..
పన్నుల భారంతో చేనేత పరిశ్రమలు మూతపడే అవకాశం
తెలంగాణలో అద్భుతమైన చేనేత సంప్రదాయం ఉందని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీరలకు తెలంగాణ ప్రసిద్ధి చెందిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రంగంలో ఉన్న నేతన్నలు జీఎస్టీ పెంపుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికే చేనేత రంగంలో ఉన్న లాభదాయకత 5 శాతం కంటే తక్కువగా ఉందని, ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా 7 శాతం టాక్స్ పెంచడం నేతన్నలు పూర్తిగా నష్టాలపాలయ్యే అవకాశం ఉందన్నారు. సంప్రదాయ చేనేత రంగం టెక్స్ టైల్ ఉత్పత్తుల నుంచి భారీ పోటీ ఎదుర్కొంటుందన్నారు. సంక్లిష్టమైన మల్టీ స్టేజ్ ప్రొడక్షన్ వల్ల చేనేత ఉత్పత్తులకు అధిక అమ్మకపు ధర ఉంటుందని తద్వారా వాటికి క్రమంగా డిమాండ్ తగ్గుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఇప్పటికే పరిమితమైన మార్కెట్ ఉన్న చేనేత రంగంపై మరో 7 శాతం అదనపు భారాన్ని వినియోగదారులపై మోపడం వలన చేనేత ఉత్పత్తులకు డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే గత సంవత్సర కాలంగా పరిశ్రమకు అవసరమైన కాటన్, యార్న్ వంటి ముడి సరుకుల ధరలు 30 నుంచి 40 శాతం పెరిగాయని కరోనా సంక్షోభం వలన చైనా వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులు తగ్గి పరిశ్రమకు అవసరమైన రసాయనాల ధరలు సైతం భారీగా పెరిగాయన్నారు. గత సంవత్సర కాలంలో భారీగా పెరిగిన ఇంధన ధరల వలన రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయన్నారు. ఇలాంటి నేపథ్యంలో అదనపు 7 శాతం పన్ను పెంపు వలన అనేక చిన్న తరహా టెక్స్ టైల్ యూనిట్లు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందన్నారు.
Also Read: : నేను నాగలి కడతా.. నువ్వు కడతావా కేసీఆర్, ఆ పౌరుషం చూపాల్సిందే.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
80 శాతం సూక్ష్మ, మధ్య తరహా యూనిట్లు
దేశంలో ఉన్న హ్యాండ్లూమ్, టెక్స్టైల్ పరిశ్రమ సుమారు 80 శాతం వరకు సూక్ష్మ, మధ్యతరహా యూనిట్లే ఉన్నాయని, ఇప్పటికే MSME పై ఉన్న పన్నుల భారం వల్ల వాటి రివైవల్ చాలా కష్టంగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకవేళ ఇలాంటి పరిమితులను ఎదుర్కొని పరిశ్రమలో కొనసాగాలనే నేతన్నలకు అదనపు వర్కింగ్ క్యాపిటల్ అవసరమయ్యే పరిస్థితి నెలకొందని, అయితే సంప్రదాయకంగా MSME లకు బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలు నిధులు అందించడంలో చురుగ్గా ఉండవన్నారు. దీంతో నేతన్నల కష్టాలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా హ్యాండ్ మేడ్ , నేచురల్ ఫైబర్, ఈకో ఫ్రెండ్లీ బట్టలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో భారతదేశానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, చేనేత, టెక్స్టైల్ రంగాన్ని బలోపేతం చేసినప్పుడే అంతర్జాతీయ స్థాయిలో దేశ వస్త్ర ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించి, ఎగుమతుల పెంచాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
Also Read: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న శ్యాం సింగరాయ్ మూవీ టీమ్