Vaikunta Ekadasi Tirupati Stampede Tragedy : వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?
Tirupati : ఉత్తర ద్వార దర్శనం కేవలం వైకుంఠ ఏకాదశి రోజే చేసుకోవాలా? ఆ రోజు నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు వెంటనే మళ్లీ నిద్రపోతాడా? ఈ తొక్కిసలాటలు, ప్రాణాలు పోగొట్టుకోవడాలు ఏంటి? దీన్ని భక్తి అంటారా?
Tirupati Stampede Tragedy : వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి..దక్షిణాయనం మొత్తం నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిద్రలేచే సమయం ఇది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును దర్శించుకునే పుణ్యం అని భక్తుల విశ్వాసం. అయితే భక్తి భక్తిలా ఉన్నంతవరకూ పర్వాలేదు..కానీ అది పిచ్చిలా మారితేనే తిరుపతిలాంటి ఘటనలు జరుగుతాయి.
వైకుంఠ ద్వారదర్శనం కోసం టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు, 48 మంది గాయపడ్డారు. ఇందులో టీటీడీ అధికారుల తప్పు ఉండి ఉండొచ్చు. పోలీసుల వైఫల్యమూ కారణం కావొచ్చూ. కానీ ఆ రెండింటి కంటే ముఖ్యమైనది ఈ ఘటనలో స్పష్టంగా కనిపిస్తోంది స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ. తెల్లవారితే వైకుంఠ ద్వార దర్శనం చేసేసుకుని మోక్షం పొందేయాలనుకున్న భక్తుల ఆత్రుత, తాపత్రయమూ, మొండి తనమూ కలగలిసి తొక్కిసలాటకు కారణమైందని...ఫలితంగా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనేది కచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం.
కేవలం ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలా?
ఆరు నెలల తర్వాత నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు వెంటనే మళ్లీ నిద్రపోతాడా?
భక్తి ఉండడంతో తప్పులేదు..కానీ ప్రాణాలమీదకు తెచ్చుకునేంత భక్తి అవసరమా?
ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నంత మాత్రాన చేసిన పాపాలన్నీ పోతాయా?
అంత దైవభీతి ఉన్నప్పుడు..భక్తి మీలో ఉన్నప్పుడు పాపాలు ఎందుకు చేయాలి?
మంచి ఆలోచన..దానం చేసే గుణం..భగవంతుడిపై భక్తిని నింపుకున్న మనసుని మించిన ఆలయం ఏముంటుంది?
ఆలయాలకు వెళ్లొద్దని చెప్పడం లేదు..పర్వదినాల్లో భగవంతుడి దర్శనమూ చేసుకోవద్దు అనడం లేదు..కానీ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చేలా ఆ భక్తి ఉండకూడదు
వాస్తవానికి వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటికేడు భారీగా పెరుగుతోంది..వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారడంతో ఈ గత రెండు మూడేళ్లుగా పది రోజుల పాటూ వైకుంఠ ద్వార దర్శనాలు అందుబాటులోకి తీసుకొచ్చారు టీటీడీ అధికారులు. ఈ పది రోజుల్లో ఏ రోజు ఉత్తరద్వార దర్శనం చేసుకున్నా శుభమే. ఆ పది రోజుల్లో క్రౌడ్ కంట్రోల్ చేసేందుకు విడతలవారిగీ టోకెన్లు జారీ చేస్తున్నారు. ఒకేసారి టోకెన్లు జారీ చేసినా ఇబ్బందే అని ఆలోచించి మొదటి మూడు రోజలకు ఓ రోజు... ఆ తర్వాత దర్శనానికి ముందురోజు టోకెన్లు ఇస్తున్నారు. అందుకోసం ఎక్కడిక్కడ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనవరి 9 ఉదయం నుంచి టోకెన్లు ఇస్తారని తెలిసి...జనవరి 8 అర్థరాత్రి పోటెత్తారు భక్తులు. ఆ ఫలితమే తిరుపతిలో జరిగిన ఘటన..
బడిలో విద్యార్థులకు, గుడిలో భక్తులకు ప్రధానంగా ఉండాల్సింది క్రమశిక్షణ. ప్రతి సందర్భంలోనూ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగితేనే పద్ధతి పాటిస్తాం అంటే మీలో ఉన్న భక్తి ఏమాత్రం? ప్రశాంతతను ఇచ్చే దేవుడి సన్నిధిలో అంతే ప్రశాంతంగా కనిపించాలి భక్తులు. అప్పుడే అక్కడ వాతావరణం మరింత పవిత్రంగా మారుతుంది...అలాంటివారిపై భగవంతుడి కరుణాకటాక్షాలు ఉంటాయి.
భక్తి భక్తిలా ఉన్నంతవరకూ అన్నీ శుభాలే జరుగుతాయి..కానీ భక్తి పిచ్చిగా మారినప్పుడే పరిస్థితులు చేయిదాటిపోతాయి. పుష్కరాల సమయంలో జరిగే ఘటనలు కూడా ఈ కోవకే చెందుతాయి. కేవలం మొదటి రోజే పుష్కరస్నానం చేసేయాలనే ఆలోచనతో భక్తులు పోటెత్తడంవల్లే తొక్కిసలాటలు జరుగుతున్నాయ్.
పదిరోజుల పాటూ ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేసినప్పుడు..భక్తులు నిదానంగా స్వామిని దర్శించుకోవచ్చు. ఇందులో అధికారుల ఏర్పాట్లు, పోలీసుల తప్పిదం ఉందా లేదా అన్నది కాదు..ముందు భక్తుల్లో మార్పురావాలి. ఇలాంటి ఘటనలవల్ల మీరు నమ్మే భగవంతుడిపై దుష్ప్రచారం జరుగుతుంది..మతంపై దుష్ప్రచారం జరుగుతుంది..ఇకనైనా ఆలోచించండి..
వైకుంఠ ఏకాదశి రోజు వేకువజామునే స్నానం ఆచరించండి, ఇంట్లోనే పూజ చేసుకోండి..ఉపవాస నియమాలు పాటించండి...విష్ణుసహస్రం పారాయణం చేసుకోండి. తిరుమలే వెళ్లాల్సిన అవసరం లేదు..మీకు సమీపంలో ఉన్న వైష్ణవ ఆలయంలో స్వామిని దర్శించుకోండి...అంతే కానీ భక్తి పేరుతో ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు..
మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీమహావిష్ణువు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి..
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
Also Read: వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. అన్నం తింటే ఏమవుతుంది!
Also Read: వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!