Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - భక్తుల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన, అధికారులకు కీలక ఆదేశాలు
Pawan Kalyan: తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. భగవంతుని దర్శనానికి వచ్చి ఆరుగురు భక్తులు మృతి చెందడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Deputy CM Pawan Kalyan Responds On Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం వచ్చిన భక్తులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. తిరుపతి ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. భగవంతుని దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం చెందడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా.
క్షతగాత్రులకు సత్వరమే మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య శాఖకు సూచించాను. మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచిస్తున్నాను. మృతుల కుటుంబాల దగ్గరకు వెళ్లి, వారిని పరామర్శించి మనోధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలకమండలి తీసుకోవాలి. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి నగరంలోని టికెట్ కౌంటర్ల దగ్గర క్యూలైన్ల నిర్వహణలో అధికారులు, పోలీస్ సిబ్బందికి జనసేన నాయకులతో పాటు జనసైనికులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.' అని పవన్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
అటు, ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Saddened by the unfortunate stampede at Tirupati Temple. Heartfelt condolences to the families who lost dear ones. Pray for the speedy recovery of the injured.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 9, 2025
విషాదం వెనుక అసలు కారణం
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించగా.. 48 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అంతటా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. తిరుపతిలోని 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి అధికారులు ఏర్పాట్లు చేయగా.. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచే భక్తులు క్యూలైన్ల వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే జీవకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. బైరాగిపట్టెడ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ కేంద్రం వద్ద భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకోగా.. వైద్యం అందించేందుకు గేట్లు తెరవడంతో క్యూలైన్లలోకి అనుమతిస్తారనే పొరబడి భక్తులు ఒక్కసారిగా రావడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.