Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
Hyderabad News: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎలాంటి కఠిన చర్యలు చేపట్టొద్దని ఆదేశించింది.
Actor Mohan Babu Gets Relief In Suprme Court: జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌బాబుకు (Mohan Babu) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. గత నెల 23న ఆ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ క్రమంలో ఆయన ఈ తీర్పును సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
కాగా, ఇటీవల మోహన్‌బాబు కుటుంబ వివాదం రచ్చకెక్కింది. ఈ క్రమంలోనే పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో ఉన్న ఫాంహౌస్‌లో గత నెల 10న న్యూస్ కవరేజీకి వెళ్లిన ఓ జర్నలిస్టుపై మోహన్‌బాబు దాడి చేశారు. మైక్ లాక్కొని అదే మైక్‌తో అతనిపై దాడి చేశారు. దీంతో సదరు విలేకరి తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మోహన్‌బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దీని ప్రకారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఆ పిటిషన్ కొట్టేసింది. దీంతో మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జర్నలిస్టుకు క్షమాపణలు
ఘటన జరిగిన అనంతరం దీనిపై మోహన్‌బాబు స్పందించారు. ఇది పూర్తిగా తన కుటుంబ వ్యవహారమని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును పరామర్శించి క్షమాపణలు చెప్పారు. అటు, పోలీసులు ఈ కేసుకు సంబంధించి చర్యలు చేపడతుండగా ఆయన రెండుసార్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు సైతం వచ్చాయి. అయితే, స్వయంగా ఆయనే దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా ఈ తతంగం జరుగుతుండగా తాజాగా సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట దక్కింది.