IPL 2025 SRH vs DC: 5 వికెట్లతో స్టార్క్ అదుర్స్, హాఫ్ సెంచరీతో ఆదుకున్న అనికేత్ వర్మ - ఢిల్లీ ముందు మోస్తరు టార్గెట్
IPL 2025 DC vs SRH : 5 వికెట్లతో స్టార్క్ సన్ రైజర్స్ ను దెబ్బకొట్టగా.. హాఫ్ సెంచరీతో అనికేత్ వర్మ ఆదుకున్నాడు. దాంతో సన్ రైజర్స్ జట్టు ఢిల్లీ ముందు మోస్తరు టార్గెట్ నిలిపింది.

IPL 2025 SRH vs DC: విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 10వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి పరుగుల వర్షం కురిపిస్తుందనుకుంటే నిరాశ పరిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది.
సన్ రైజర్స్ టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. అభిషేక్ శర్మ (1) లేని పరుగులకు ప్రయత్నించి తొలి ఓవర్ లోనే రనౌట్ అయ్యాడు. ఆపై మూడో ఓవర్లో మిచెల్ స్టార్క్ సన్ రైజర్స్ ను భారీ దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలను ఔట్ చేసి హైదరాబాద్ జట్టుకు భారీ షాకిచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికి ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్(2)ను ఔట్ చేశాడు. కిషన్ ఆడిన బంతిని బౌండరీ వద్ద స్టబ్స్ క్యాచ్ అందుకోవడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన లోకల్ బాయ్ నితీష్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు. స్టార్క్ వేసిన బంతిని నితీష్ ఆడగా చాలా ఎత్తులో లేచి థర్టీ యార్డ్ సర్కిల్ లోనే అక్షర్ పటేల్ క్యాచ్ అందుకోవడంతో 3వ వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దాంతో సన్ రైజర్స్ 3 ఓవర్లకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మరోసారి స్టార్క్ చేతికి చిక్కిన హెడ్
ట్రావిస్ హెడ్ ను ఇప్పటివరకూ 7 ఇన్నింగ్స్ ల్లో 5 సార్లు మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. నేడు 8వ ఇన్నింగ్స్ లోనూ ట్రావిస్ హెడ్ దొరికిపోయాడు. కీపర్ రాహుల్ కు క్యాచిచ్చి 6వ సారి మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ వికెట్ చేజార్చుకున్నాడు.
Let's do it 💪#PlayWithFire | #DCvSRH | #TATAIPL2025 pic.twitter.com/6sUymMtlkD
— SunRisers Hyderabad (@SunRisers) March 30, 2025
ఆదుకున్న అనికేత్ వర్మ
గత మ్యాచ్ లో రాణించిన అనికేత్ వర్మ మరోసారి సన్ రైజర్స్ కు ఆపద్భాందవుడు అయ్యాడు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. క్లాసెన్ (32, 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి 5వ వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మోహిత్ శర్మ బౌలింగ్ లో క్లాసెన్ ఆడిన బంతిని నిగమ్ క్యాచ్ అందుకున్నాడు. ఆ తరువాత సన్ రైజర్స్ వేగంగా వికెట్లు కోల్పోయింది. అభినవ్ మనోహర్, కెప్టెన్ పాట్ కమిన్స్ ను చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు.
ANIKET VERMA - FIND OF IPL 2025. pic.twitter.com/cMIRMiH227
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 30, 2025
ఆపై భారీ షాట్లు కొడుతూ స్కోరు బోర్డును నడిపించిన హాఫ్ సెంచరీ వీరుడు అనికేత్ వర్మ (74, 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద పక్షిలా ఎగురుతూ మెక్ గుర్క్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు అనికేత్ వర్మ ఇన్నింగ్స్ ముగిసింది. స్టార్క్ 19వ ఓవర్లో హర్షల్ పటేల్(5), మల్డర్ (9)ను ఔట్ చేయడంతో ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్క్ 5/35 తో హైదరాబాద్ టీమ్ వెన్నువిరిచాడు.





















