Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Venezuela: వెనిజులాలో అమెరికాలో ఆగ్రహం వ్యక్తం కావడం లేదు. ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి కారణాలు ప్రజలు మదురోపై అసంతృప్తి పెంచుకోవడమే.

Venezuelans celebrate if the US kidnaps the president: వెనిజులా ఒకప్పుడు లాటిన్ అమెరికాలోనే అత్యంత సంపన్న దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న ఈ దేశం, నేడు కటిక దారిద్ర్యంలోకి కూరుకుపోవడానికి దశాబ్ద కాలంగా సాగుతున్న నిరంకుశ పాలన, ఆర్థిక కుంభకోణాలు, అంతర్జాతీయ ఆంక్షలు ప్రధాన కారణం.
సంపన్న దేశం నుంచి నిరుపేద దేశంలాగా మారిన వెనిజులా
1970వ దశకంలో వెనిజులా తలసరి ఆదాయం స్పెయిన్ లేదా గ్రీస్ కంటే ఎక్కువగా ఉండేది. కానీ, కేవలం చమురుపైనే అతిగా ఆధారపడటంఆ దేశానికి శాపమైంది. హ్యూగో చావెజ్ హయాంలో ప్రారంభమైన సోషలిస్ట్ విధానాలు, మదురో కాలానికి వచ్చేసరికి పూర్తిగా విఫలమయ్యాయి. చమురు ధరలు పడిపోవడం, విచ్చలవిడి అవినీతి, ప్రభుత్వ సంస్థల నిర్వహణ లోపం వల్ల ద్రవ్యోల్బణం లక్షల శాతానికి చేరుకుంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి నశించి, కనీసం రొట్టె ముక్క కూడా కొనలేని దుస్థితి ఏర్పడింది.
మదురో పాలనలో బానిసలుగా ప్రజలు
నికోలస్ మదురో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సైన్యాన్ని , ప్రభుత్వ వ్యవస్థలను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఆహార సరఫరాను నియంత్రించడం ద్వారా ప్రజలను తనపై ఆధారపడేలా చేసుకున్నారని అంతర్జాతీయ సమాజం విమర్శిస్తోంది. అంటే, ప్రభుత్వానికి మద్దతు ఇస్తేనే తిండి దొరుకుతుందనే పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజలను పరోక్షంగా ఆర్థిక బానిసలుగా మార్చారు. వ్యతిరేకించిన వారిపై అణచివేత, అక్రమ అరెస్టులు, మానవ హక్కుల ఉల్లంఘనలు నిరంతరం సాగుతున్నాయి. మదురోనూ అమెరికా తీసుకెళ్లిన అంశంపై ప్రతిపక్షాలు , బాధిత ప్రజలు మాత్రం దీనిని తమ దేశానికి దక్కిన విముక్తిగా భావిస్తున్నారు. ఈ చర్యతో వెనిజులాలో ఒక చీకటి అధ్యాయం ముగిసిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అత్యధిక మంది వెనిజులా ప్రజల సంతోషం
మదురో అరెస్టు వార్త వినగానే వెనిజులాలోని కారకాస్ వంటి నగరాల్లో , విదేశాలకు వలస వెళ్లిన వెనిజులా ప్రజలలో పండుగ వాతావరణం నెలకొంది. వీధుల్లోకి వచ్చి ప్రజలు జెండాలతో సంబరాలు చేసుకుంటున్నారు. వివిధ సర్వేల ప్రకారం, వెనిజులాలోని సుమారు 80 శాతం నుండి 85 శాతం మంది ప్రజలు మదురో పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరంతా అమెరికా చర్యను స్వాగతిస్తున్నారు. కేవలం సైన్యం , ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న ఒక పదిహేను శాతం మంది మాత్రమే ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.
భవిష్యత్తుపై ఆశలు
మదురో పతనం తర్వాత వెనిజులా మళ్లీ పూర్వవైభవాన్ని అందుకుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ ఆంక్షలు తొలగడం, చమురు ఉత్పత్తి మళ్లీ పుంజుకోవడం , ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడటం ద్వారా తమ జీవితాలు మారుతాయని వారు నమ్ముతున్నారు. అయితే, దశాబ్దాల విధ్వంసం నుండి దేశాన్ని బయటపడేయడం అంత సులభం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, మదురో విముక్త వెనిజులా కోసం అక్కడి ప్రజలు దశాబ్ద కాలంగా కన్న కల నేడు నిజమైనట్లు కనిపిస్తోంది. వెనిజులా ప్రజలు ప్రస్తుతం ఒక చారిత్రాత్మక మార్పును చూస్తున్నారు.





















