LRS In Telangana: సెలవు దినాలైనా.. నేడు, రేపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు, ఆస్తి పన్ను చెల్లింపులకు అవకాశం
నేడు (ఉగాది), రేపు (రంజాన్) పండుగలు ఉన్నా.. ఈ సెలవు దినాల్లోనూ ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లింపునకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లో రుసుం స్వీకరించనున్నట్లు పురపాలక శాఖ స్పష్టం చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు రోజుల్లో ముగియనుంది. అయితే లే అవుట్ల క్రమబద్ధీకరణకు(ఎల్‌ఆర్‌ఎస్) రుసుము చెల్లింపునకు రెండ్రోజులు మాత్రమే గడువు ఉంది. అయినా ఇప్పటివరకు చాలా మంది ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు (ఉగాది), రేపు (రంజాన్) పండుగలు ఉన్నా.. ఈ సెలవు దినాల్లోనూ ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లింపునకు అవకాశం కల్పించింది. ఆది, సోమవారాల్లో ఉగాది, రంజాన్ పండుగలు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో రుసుం స్వీకరించనున్నట్లు పురపాలక శాఖ స్పష్టం చేసింది.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాలని 20,00,439 మంది దరఖాస్తుదారులకు లేఖలు రాయగా శుక్రవారం వరకు 3,25,538 మంది చెల్లించినట్లు స్పష్టం చేసింది. మొత్తం 25.67 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొంది. ఈ నెల 30, 31 తేదీల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు కొనసాగుతాయని పురపాలకశాఖ వెల్లడించింది. రెండు రోజుల్లో ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
రిజిస్ట్రేషన్ల కార్యాలయాలన్నీ పనిచేస్తయ్..
31న రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల కార్యాలయాలన్నీ పనిచేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రకటించింది. ఈ శాఖ కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడం, ఎల్‌ఆర్‌ఎస్ తదితర రుసుముల చెల్లింపులకు వీలుగా 31న సెలవు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కార్యాలయాలలో అందుబాటులో ఉంటారని స్పష్టం చేసింది.
ఆస్తి పన్నుపై వడ్డీలో 90శాతం రాయితీ..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుపై ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’కు తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ తరహాలో ఆస్తి పన్నుపై వడ్డీలో 90శాతం రాయితీ ఇవ్వాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవడంతో ఆస్తిపన్ను వసూళ్లు రూ.వెయ్యి కోట్లు దాటిందని రాష్ట్ర పురపాలక శాఖ తెలిపింది.
రూ.1010 కోట్ల పన్ను వసూళ్లు
రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కలిపి ఇప్పటివరకు రూ.1010 కోట్ల మేర ఆస్తిపన్ను వసూలైనట్లు వెల్లడించింది. మార్చి 31 నాటికి ఆస్తిపన్ను బకాయిలపై 10 శాతం వడ్డీ చెల్లించిన వారికి ఓటీఎస్ వర్తిస్తుందని పురపాలకశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 30, 31న సెలువులైనప్పటికీ ప్రజలు ఆస్తి పన్ను చెల్లించవచ్చని తెలిపింది. రెండు రోజుల్లో ఆస్తిపన్ను చెల్లించి వడ్డీపై 90శాతం రాయితీ సద్వినియోగం చేసుకోవాలని పురపాలక శాఖ సూచించింది.





















