Crime News: చెరువులో మునిగి ముగ్గురు పిల్లలు, వారిని కాపాడేయత్నంలో తల్లి సైతం మృతి

ఎల్లారెడ్డి: తెలుగు వారి తొలి పండుగ ఉగాది నాడు తెలుగు రాష్ట్రాల్లో సందడి కనిపిస్తోంది. భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. కానీ కామారెడ్డి జిల్లాలో ఉగాది పండుగ నాడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ చెరువులో మునిగిపోయి వివాహిత, ఆమె ముగ్గురు పిల్లలు మృతిచెందారు. ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లో ఆదివారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
ఆదివారం (మార్చి 30న) ఉదయం ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్‌లోని చెరువు వద్దకు వివాహిత మౌనిక తన ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్లింది. ఓవైపు ఆమె దుస్తులు ఉతుకుతుండగా.. మరోవైపు ఆమె పిల్లలు ముగ్గురూ స్నానానికి చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తూ భారీ గుంత వద్దకు చిన్నారులు వెళ్లడంతో మైథిలి (10), అక్షర (8), వినయ్ (5) చెరువులో పడి మునిగిపోయారు. చిన్నారులు అరుస్తుంటే గమనించిన తల్లి వారిని కాపాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలతో పాటు తల్లి మౌనిక (26) సైతం చెరువులో మునిగి చనిపోయింది. ఉగాది పండుగ నాడు వివాహిత ఆమె ముగ్గురు పిల్లలు మృతిచెందడంతో వెంకటాపూర్ లో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నలుగురి మృతిపై కేసు నమోదు చేశారు.






















