KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Formula E Car Race: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలతో ఆయన వెంట ఓ లాయర్‌ను అనుమతించారు.
KTR Attended To ACB Investigation In Formula E Car Race: ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Car Race) వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 10:10 గంటలకు ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన వెంట లాయర్ రామచంద్రమూర్తి ఉన్నారు. ఈ కేసు విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు కేటీఆర్‌కు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే, విచారణను దూరం నుంచి చూడటానికి మాత్రమే అవకాశం ఉంటుంది ... విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని న్యాయవాదికి స్పష్టం చేసింది. లైబ్రరి విండో నుంచి విచారణ చూడొచ్చని ఏసీబీ అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లగా ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. విచారణలో అభ్యంతరాలు ఉంటే కేటీఆర్ మరోసారి హైకోర్టుకు రావొచ్చని ధర్మాసనం తెలిపింది. కాగా, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతీరాజ్, అడిషనల్ ఎస్పీ శివరాం శర్మ, డీఎస్పీ మాజీద్ ఖాన్ కేటీఆర్‌ను విచారిస్తున్నారు.
భారీ భద్రత
కేటీఆర్ విచారణ సందర్భంగా పోలీసులు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి అర్వింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. అర్వింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్, రికార్డ్ చేసిన అంశాల ఆధారంగా విచారణ చేయనున్నారు. విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ అధికారులు ఆయన్ను ప్రశ్నించనున్నారు.
'పైసా కూడా అవినీతి చేయలేదు'
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో పైసా కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ (KTR) అన్నారు. ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు ఆయన నందినగర్‌లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. భాగ్యనగర ప్రతిష్టను పెంచడానికి, బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని చెప్పారు. 'హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. అవి చాలావరకూ ఫలించాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మా బావమరుదులకు రూ.1,137 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని చేయలేదు. మంత్రిగా ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదు. ఆ తెలివితేటలు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులకే ఉన్నాయి. నేనే ఏ పని చేసినా హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకే చేశాను. అరపైసా అవినీతి చేయలేదు. చేయబోను. కొంతమంది కాంగ్రెస్ నేతలు మాపై బురద జల్లుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మేం ప్రశ్నిస్తూనే ఉంటాం. మాపై కేసులు పెట్టి.. హైడ్రా కూల్చివేతలు, లగచర్ల ఘటనలో రైతులను జైల్లో పెట్టడం, ఆరు గ్యారెంటీల అమలు వంటి అంశాలను పక్కదోవ పట్టించాలనుకోవడం సీఎం రేవంత్ వల్ల కాదు. ఇంకో వెయ్యి కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటాం. మాకు న్యాయస్థానాలు, చట్టాలు, రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉంది.' అని కేటీఆర్ పేర్కొన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్
మరోవైపు, కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. అటు, కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన భర్త అనిల్‌తో కలిసి వచ్చారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, కోరుకంటి చందర్ తదితరులు అక్కడికి చేరుకున్నారు.
Also Read: Hyderabad News: పెళ్లైన 21 రోజులకే తీవ్ర విషాదం - ఉరేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య