Venkaiah Naidu: మోదీ కొత్తగా తేలేదు, జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వాఖ్యలు
One Nation One Election | జమిలి ఎన్నికలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వాఖ్యలు చేశారు. దేశ పురోగతికి జమిలి ఎన్నికలే సరైనవని అభిప్రాయపడ్డారు.

Venkaiah Naidu on One Nation One Election: జమిలి ఎన్నికలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వాఖ్యలు చేశారు. దేశ పురోగతికి జమిలి ఎన్నికలే సరైనవని అభిప్రాయపడ్డారు. నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుందని, ప్రభుత్వాలు బలోపేతమవుతాయని పేర్కొన్నారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు వెంకయ్య నాయుడు చీఫ్ గెస్ట్‌గా హాజరై ప్రసంగించారు.
మోదీ కొత్తగా తీసుకొచ్చిన విధానం కాదు
దేశమంతటా ఒకేసారి లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగితే.. నిర్వహణ వ్యయం, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గుతుందని, ప్రభుత్వాల పనికి అంతరాయం ఉండదని వెంకయ్య నాయుడు అన్నారు. జమిలి విధానం ప్రధాని మోదీ కొత్తగా తీసుకొచ్చింది కాదని, స్వాతంత్య్రం వచ్చాక 1952, 57, 62, 67లో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్నప్పుడు కూడా జరిగాయని గుర్తుచేశారు. ఐదేళ్ల వరకూ ప్రజాప్రతినిధులు, అధికారులు పాలన, అభివృద్ధిపై దృష్టి పెట్టొచ్చని పేర్కొన్నారు.
‘జమిలి ఎన్నికలతో కేంద్రంలో ఉండే పార్టీకి ప్రయోజనమని, ప్రాంతీయ పార్టీలకు నష్టమన్న వాదనలో నిజం లేదు. గతంలో ఏకకాలంలో ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రంలో ఒకే పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా, ప్రాంతీయ పార్టీలు గెలిచాయి. ప్రజలు విచక్షణతో ఓటేస్తారు. జమిలితో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందన్నది అవాస్తవం. తరచూ ఎన్నికలొస్తే ఓటర్లకు విసుగొస్తుంది. ఐదేళ్లకోసారి పెడితే ఉత్సాహంగా ఓటేస్తారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
అమెరికా, బ్రెజిల్, స్వీడన్, బెల్జియం, దక్షిణాఫ్రికా, జర్మనీ, జపాన్, ఇండోనేసియా సహా పలు దేశాలు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎలక్షన్ కమిషన్, భారత న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ కూడా జమిలి ఎన్నికలే సరైనవని ప్రతిపాదించాయని మాజీ ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఎన్నికల ఖర్చును కూడా భారీగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనాల ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ.55-60 వేల కోట్లు. 2024లో రూ.1.35 లక్షల కోట్లకు పెరిగింది. లెక్కల్లోకి రాని ప్రచార ఖర్చు దానికి అదనం. జమిలితో నల్లధనం వినియోగం, అవినీతిని కూడా అరికట్టవచ్చు’అని వెల్లడించారు.
1984లోనే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటూ భాజపా ప్రకటించిందని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. 2023లో ఏర్పాటుచేసిన జమిలి కమిటీకి 50% రాజకీయ పార్టీలు, 100% సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, 75% హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, 100% మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, 87% మంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అసోచాం, సీఐఐ, ఎఫ్‌ఐసీసీఐ సహా అనేకమంది మద్దతిచ్చారని వెల్లడించారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, వనరులతో సంబంధం లేకుండా అప్పులు చేస్తే, తర్వాతి ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని ఆలోచించాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. విద్య, వైద్యానికి తప్ప వేటికీ ఉచితాలు అవసరం లేదని స్పష్టంచేశారు.
సభాధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావు మాట్లాడుతూ దేశంలో పది సార్లు ఎన్నికలు నిర్వహించడానికి, ఒకేసారి పెట్టడానికి మధ్య తేడా రూ.50 వేల కోట్ల వరకూ ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్‌యాదవ్, ఎమ్మెల్యేలు పార్థసారథి, కామినేని శ్రీనివాస్, సుజనాచౌదరి, బీజేపీ నేతలు పాల్గొన్నారు.





















