Myanmar Earthquake: మయన్మార్ భూకంపం.. 334 అణుబాంబులతో సమానమైన శక్తి విడుదల
మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో సంభవించిన రెండు భారీ భూకంపాలు 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేశాయని, అందుకే భారీ ప్రళయం సంభవించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు.

మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో సంభవించిన రెండు భారీ భూకంపాలు ఆ దేశాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 7.7 మ్యాగ్నిట్యూడ్‌తో వచ్చిన భూకంపం ధాటికి అనేక భవనాలు కుప్పకూలాయి. శిథిలాల్లో నలిగిపోయి చనిపోయిన దాదాపు 1700 మంది డెడ్‌బాడీలను ఇప్పటివరకు గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 3,400 మందికి పైగా గాయపడ్డారు.
అయితే ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేందని, అందుకే భారీ ప్రళయం సంభవించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
10 కి.మీ. లోతులోనే ప్రకంపనల కేంద్రాలు
భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం కారణంగా నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్ వచ్చే ప్రమాదం ఉందని జెస్ ఫీనిక్స్ అన్నారు. దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ విపత్తు మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. కమ్యూనికేషన్‌లో అంతరాయం వల్ల అక్కడి పూర్తిస్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించే అవకాశం లేకుండా పోయిందన్నారు. భూఉపరితలానికి 10 కి.మీ. లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది.
మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మండలేలో నివసించే 1.5 మిలియన్ల మందిలో చాలా మంది నిరాశ్రయులయ్యారు. దీంతో రాత్రిపూట వీధుల్లో నిద్రపోవాల్సి వచ్చింది. మొత్తంగా ఇంకా 3 వేల మందికి పైగా జాడ తెలియలేదని మయన్మార్‌లోని కాథలిక్ రిలీఫ్ సర్వీసెస్ మేనేజర్ కారా బ్రాగ్ పేర్కొన్నారు.
నేపిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కూడా భూకంపం ధాటికి కూలిపోయింది. ఈ నగరంలో రహదారులు, విద్యుత్, ఫోన్, ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. మాండలేలో అధిక సంఖ్యలో నివాస భవనాలు కూలిపోవడంతో ప్రాణ నష్టం అధికంగా ఉంది. శిథిలాల తొలగింపుతో పాటే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో క్షతగాత్రులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
సాయమందిస్తున్న భారత్, ఇతర దేశాలు
కష్టకాలంలో అక్కడి ప్రజలకు చేయూతనందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ పేరుతో 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలు, తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం. 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని కూడా అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి.
నిమిషాల వ్యవధిలో వరుస భూకంపాలు
మయన్మార్‌లో శనివారం ఉదయం 11.53 గంటల సమయంలో 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8 తీవ్రతతో, ఆ తర్వాత మరో 20 నిమిషాల వ్యవధిలో 4.7 తీవ్రతతో వరుసగా ప్రకంపనలు వచ్చినట్లు భూకంపన వైజ్ఞానిక కేంద్రాలు వెల్లడించాయి.
ఈరోజు మళ్లీ ప్రకంపనలు
ఇదిలా ఉండగా ఆదివారం మయన్మార్‌లోని మండలే నగరంలో 5.1 తీవ్రతతో మళ్లీ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు వీధుల్లోకి చేరి కేకలు వేశారు. అయింతే ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

