అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
టీమిండియా లక్కీ చార్మ్.. శివమ్ దూబే లక్కీ రికార్డ్‌కి బ్రేక్ పడింది. గత 37 మ్యాచ్‌లుగా.. శివమ్ దూబే టీమ్‌లో ఉండగా.. టీమిండియా ఒక్కసారి కూడా ఇంటర్నేషనల్ టీ20ల్లో ఓడిపోలేదు. దీంతో దూబేని టీమిండియా లక్కీ ఛార్మ్ అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తుంటారు. కానీ ఈ సారి ఆసీస్ బౌలర్ల దెబ్బకి దూబే లక్ కూడా ఫెయిల్ అయింది. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో.. దూబే విన్నింగ్ స్ట్రీక్‌కి 38వ మ్యాచ్‌లో బ్రేక్ పడినట్లైంది. అయితే విన్నింగ్స్ స్ట్రీక్‌కి బ్రేక్ పడినా.. ఇంటర్నేషనల్ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడి రికార్డ్ మాత్రం దూబే పేరునే ఉంది.
2019లో బంగ్లాదేశ్‌తో ఇంటర్నేషనల్ టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన దూబే.. ఇప్పటి వరకు ఇండియా తరపున 43 టీ20లు ఆడాడు. వాటిలో వరుసగా 37 మ్యాచ్‌లు గెలిచాడు. 2019 డిసెంబర్‌లో త్రివేండ్రం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దూబే ఉండగానే టీమిండియా చివరిసారిగా ఓడింది. ఆ తర్వాత రీసెంట్‌గా జరిగిన ఆసీస్‌తో మ్యాచ్ వరకు దూబే ఆడిన ప్రతి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. గత రెండేళ్లుగా జట్టులో నిలకడగా అవకాశాలు అందుకుంటున్న దూబే.. భారత్ గెలిచిన టీ20 ప్రపంచకప్ 2024, ఆసియా కప్ 2025 జట్లలోనూ మెంబర్‌గా ఉన్నాడు. ఒక్క దూబేనే కాదు.. 24 మ్యాచ్‌లుగా ఓటమనేదే లేకుండా ఉన్న బుమ్రా విన్నింగ్ స్ట్రీక్‌కి కూడా ఈ మ్యాచ్‌తో బ్రేక్ పడింది.
ఇక ప్రస్తుతం ఉన్న రికార్డులను బట్టి చూస్తే.. దూబే 37 విజయాలతో టాప్‌లో ఉంటే.. సెకండ్ ప్లేస్‌లో 27 విజయాలతో ఉగాండా ప్లేయర్ పాస్కర్ మురుంగి.. మూడో ప్లేస్‌లో 24 విజయాలతో మన బుమ్రా, నాలుగో ప్లేస్‌లో టీమిండియా మాజీ ప్లేయర్ మనీష్ పాండే, ఐదో ప్లేస్‌లో పాక్ ఓపెనర్ మహ్మద్ షెహ్జాద్ ఉన్నారు.





















