HILTP Land Scam: హిల్ట్ భూములపై బీఆర్ఎస్ పోరాటం.. 2 రోజులపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు నేతలు
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ' (HILTP) పేరుతో భూములను రియల్ ఎస్టేట్ పరం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు బృందాలుగా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.

KTR Latest News | హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి భారత రాష్ట్ర సమితి (BRS) సిద్ధమైంది. హైదరాబాద్ మహానగర పరిధిలో రూ. 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను 'హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ' (HILTP) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దాన్ని అడ్డుకోవాలని BRS నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన 'నిజనిర్ధారణ బృందాలను' (Fact-Finding Committees) నియమించారు. దీనిలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి పర్యటనలపై దిశానిర్దేశం చేశారు.
భూములను రియల్ ఎస్టేట్ పరం చేస్తున్న కాంగ్రెస్..
బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను, ఇప్పుడు 'మల్టీ యూజ్ జోన్' పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల విలువైన భూములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్.ఆర్.ఓ (SRO) రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేసి, సుమారు రూ. 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి, కనీసం స్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ కుంభకోణం నిజా నిజాన్ని ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఐదు లక్షల కోట్ల కాంగ్రెస్ పార్టీ భూ కుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాటానికి సిద్ధమైన బీఆర్ఎస్.
— KTR News (@KTR_News) December 2, 2025
HILTP వలన రాష్ట్ర ప్రజలకు కలిగే నష్టంపై నిజనిర్ధారణ కోసం హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజనిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసి నాయకులకు దిశానిర్దేశం చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్… pic.twitter.com/58Pu4cGwW2
ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టేందుకు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి, పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు డిసెంబర్ 3, 4 తేదీల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తాయి. ఈ పర్యటనలలో బీఆర్ఎస్ నాయకులు స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకుని, వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ("Price Discovery") ప్రజల ముందు ఉంచాలని ప్లాన్ చేశారు. ఈ పర్యటనల్లో, పారిశ్రామిక వాడల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమేం చేయవచ్చు, అక్కడి స్థానిక ప్రజల సుదీర్ఘకాల డిమాండ్లు, ఆకాంక్షలను కూడా పార్టీ నేతలు తెలుసుకోనున్నారు. ఒకప్పుడు పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ప్రజలు భూములు ఇచ్చిన తీరును, ప్రభుత్వాలు అత్యంత చవకగా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన అంశాన్ని, వాటి అసలు ఉద్దేశాలను ఈ బృందాలు ప్రజలకు వివరించనున్నాయి.
హెచ్.ఐ.ఎల్.టి.పి (HILTP) స్కామ్ నిజనిర్ధారణ బృందాల పర్యటన వివరాలు
డిసెంబర్ 3, 4 తేదీలలో HILTP స్కామ్‌పై నిజనిర్ధారణ కోసం BRS పార్టీ ఏర్పాటు చేసిన ఎనిమిది బృందాలు వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. క్లస్టర్-1లో మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్ మరియు మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాలను సందర్శించి స్కామ్ ఎలా జరుగుతుందో వివరించనున్నారు. క్లస్టర్-2లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సురభి వాణీ దేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చెర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు. క్లస్టర్-3కు సంబంధించి మధుసూదనాచారి, మర్రి రాజశేఖర్ రెడ్డి, రవీందర్ రావు మౌలాలి, కుషాయిగూడ పారిశ్రామిక వాడలను సందర్శించి భూముల ధర, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ప్రజలకు వివరిస్తారు.
ముఖ్యంగా క్లస్టర్-4లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందతో కలిసి జీడిమెట్ల, కూకట్‌పల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మరోవైపు క్లస్టర్-5లో తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నవీన్ రావు సనత్ నగర్, బాలానగర్ ఏరియాలను పరిశీలిస్తారు. క్లస్టర్-6లో చామకూర మల్లారెడ్డి, శంభీపూర్ రాజు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కుకు వెళ్తారు. క్లస్టర్-7లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్వామి గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కార్తీక్ రెడ్డి కాటేదాన్, హయత్ నగర్ లో పర్యటిస్తారు. చివరగా క్లస్టర్-8లో మాజీ మంత్రి మహమూద్ అలీ, దాసోజు శ్రవణ్, ఎండీ సలీం చందులాల్ బారాదరి పారిశ్రామిక వాడను సందర్శించి వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.






















