Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారికి కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

పలాస: శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన శనివారం సాయంత్రం పలాస ఆసుపత్రికి చేరుకున్న ఆయన, సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం, పార్టీ తరఫున అందించే తక్షణ సహాయాన్ని ప్రకటించారు.
బాధితులకు ఆర్థిక సాయం ప్రకటన
కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 9 మంది భక్తుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 15 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షలు కలిపి మొత్తం రూ. 17 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రాష్ట్రం నుంచి రూ. 3 లక్షలు, కేంద్రం నుంచి రూ. 50 వేలు కలిపి మొత్తం రూ. 3.5 లక్షలు ఇస్తారు. మృతుల కుటుంబాలకు మట్టి ఖర్చుల కింద తక్షణ సహాయంగా రూ.పదివేలు పరిహారం లభిస్తుంది. అంతేకాక, మృతుల్లో తెలుగుదేశం పార్టీ (TDP) సభ్యత్వం ఉన్న ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున బీమా కింద ఒక్కొక్కరికి అదనంగా రూ. 5 లక్షల చొప్పున సాయం అందుతుందని తెలిపారు.

గుడి నిర్మాణంలో లోపాలపై ఫోకస్
ఈ ఘటనలో మొత్తం 16 మంది క్షతగాత్రులు కాగా, వారిలో ముగ్గురు ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. ఆలయం నిర్మించి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ, ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే విషయాన్ని నిర్వాహకులు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. దశల వారీగా గుడి నిర్మాణం జరిగింది. భారీ గేట్లు వేశారు కానీ, ఫౌండేషన్ (పునాది) బలంగా లేకపోవడం ప్రమాద తీవ్రతను పెంచింది. గుడి నిర్మాణంలో జరిగిన లోపాలపై పై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతారని లోకేష్ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు.
క్షత్రగాత్రులకు పూర్తి స్థాయిలో వైద్యంతో పాటు ఇతర సహకారం అందిస్తామని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు., వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పుడెప్పుడు ఏయే కట్టేరో అన్న వివరాలు తెలుసుకుంటామని, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణం రెయిలింగ్ ఊడిపడిపోవటమేనని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆలయ నిర్వాహకులపై కేస్ నమోదు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.






















