(Source: ECI | ABP NEWS)
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
కరణ్ జోహార్‌ని బురిడీ కొట్టించి బాహుబలి కొనిపించాడు రానా అంటూ రాజమౌళి తెలిపారు. 'బాహుబలి'లో ఇద్దరు హీరోలు అంటూ కరణ్ జోహార్‌కు రానా చెప్పిన విషయాన్ని ప్రభాస్ కు రాజమౌళి చెప్పారు.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రస్తుత తరంలో దేశ విదేశాలు దాటించిన ఘనత ఖశ్చితంగా బాహుబలిదే. తెలుగు సినిమాగా ప్రారంభమై పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టి ఆ సినిమాలో నటించిన వారందరినీ ఓవర్ నైట్ సూపర్ స్టార్ లుగా మార్చేసింది బాహుబలి సినిమా అయితే తనను నమ్మి ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అయినా పెట్టొచ్చు అనే భరోసాను జాతీయస్థాయిలో ప్రొడ్యూసర్లకు కల్పించిన ఘనత రాజమౌళి సాధించారు. అయితే ఈ సినిమా మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ బాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లి ప్రమోట్ చేసిన క్రెడిట్ ఖశ్చితం గా కరణ్ జోహార్ దే. బాలీవుడ్ లో నిర్మాతగా దర్శకుడుగా డిస్ట్రిబ్యూటర్ గా ఇంకా చెప్పాలంటే స్టార్ మేకర్ గా కరణ్ జోహార్ చక్రం తిప్పుతున్నారు. బాహుబలి ఆయన చేతిలో పడడం తో జాతీయస్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది. ఇంతకూ కరణ్ జోహార్ దగ్గరకు ఈ సినిమాను తీసుకువెళ్ళింది రాజ మౌళి నో, ప్రభాస్ నో కాదు ఆ పని చేసింది రానా దగ్గుబాటి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ సినిమాను కొనిపించడానికి రానా బాహుబలి స్టోరీని కరణ్ జోహార్ కి మరోలా చెప్పాడని సినిమా రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత రాజమౌళి రివీల్ చేశారు.
బాహుబలిలో ఇద్దరు హీరోలన్న రానా... నా సినిమా ఇది కాదన్న రాజమౌళి
బాహుబలికి ముందు మగధీర, మక్కి (ఈగ ) ఇలాంటి సినిమాలు తీసిన దర్శకుడుగా రాజమౌళికి బాలీవుడ్ లో గుర్తింపు ఉంది. అయితే వాటన్నిటిని మించిన బాహుబలి రేంజ్ ఏంటో అప్పటికి బాలీవుడ్ కి తెలియదు. బాహుబలిని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న రాజమౌళి దానికి రానా సాయం కోరారు. బాలీవుడ్ లోనూ చాలా సినిమాలు తీసిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు మనవడిగా అప్పటికే రానాకు హిందీ మార్కెట్ లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కరణ్ జోహార్ తో పరిచయం ఉంది. ఆయన్ని కలిసిన రానా ఈ సినిమాలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారని... ఇద్దరూ హీరోలని ఒకరు ప్రభాస్, మరొకరు తాను (రానా) అని చెబుతూ సినిమాలోని కొన్ని మేకింగ్ షాట్స్ చూపించారు. దానితో బాగా ఇంప్రెస్ అయిన కరణ్ జోహార్ వెంటనే రాజమౌళిని ఆహ్వానించారు. ముంబై వెళ్ళిన రాజమౌళితో ఈ సినిమాను తాను హిందీలో డబ్ చేస్తానని చెప్పి తన ధర్మ ప్రొడక్షన్ తో అగ్రిమెంట్ చేయించారు. ఆ మాటల్లోనే "ఇద్దరు హీరోల" కథ అదిరిపోయిందని చెప్పడంతో రాజమౌళి షాక్ తిన్నారు. మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ ఇద్దరు హీరోల కథ నాది కాదే అనుకుంటూ హైదరాబాద్ వచ్చేసారు. అక్కడ రానానే అసలు నువ్వు కరణ్ జోహార్ కి ఏం చెప్పావు అని అడగడంతో "నేను ఏం చెబితే ఏముంది సార్" మన పని సక్సెస్ అయిందిగా అంటూ నవ్వేశారట రానా. సినిమా రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ రాజమౌళి తన హీరో ప్రభాస్ తో చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
తెలుగు పాన్ ఇండియన్ సినిమాల అండా - దండా... దగ్గుబాటి రానా
చెప్పుకోవడానికి ఇదో సరదా ఇన్సిడెంట్ లా ఉన్నా బాహుబలి మేకింగ్ కోసం రాజమౌళి & టీమ్ ఎంత కష్టపడిందో దాన్ని ప్రమోట్ చేయడానికి రానా కూడా అంతే కష్టపడ్డారు. తనకు తెలిసిన ప్రతీ బాలీవుడ్ మేకర్ కూ సెలబ్రిటీ కి టాలీవుడ్ లో ఒక అద్భుతం జరగబోతోంది బాహుబలి రూపంలో అంటూ ప్రమోట్ చేస్తూ వాళ్లలో ఆసక్తిని క్రియేట్ చేసింది రానానే. నేషనల్ లెవెల్ లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బాహుబలి పోస్టర్స్ పెట్టించడం, బాహుబలి బజ్ దేశం అంతా పాకేలా ప్రమోట్ చేయడం వంటి బాధ్యతలు ఆయనే మోసాడు. సినిమా ప్రొడ్యూసర్ తాను కాదు, అందులో హీరో కాదు అలాంటిది ప్రమోషన్ భారాన్ని అదీ పరాయి భాషల్లో అంతలా మోయడం రానాకే చెల్లింది. రామానాయుడి మనవడిగా ఆయనకున్న గౌరవంతో బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం బాహుబలిపై ఆసక్తి చూపారు. చివరికి సినిమా రిలీజ్ రోజున కూడా ఆయన ముంబైలో ప్రమోషన్స్ లోనే ఉన్నారని రాజమౌళి స్వయంగా చెప్పారు. రిలీజ్ రోజున తెలుగు టాక్ చూసి నిరాశలో ఉన్న రాజమౌళి, ప్రభాస్ లకు ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పి భరోసా ఇచ్చింది కూడా రానానే. బయటి ఇండస్ట్రీని అంతగా స్వాగతించే అలవాటు లేని ఒకప్పటి బాలీవుడ్ జనాల మైండ్ సెట్ మార్చేంతగా బాహుబలిని రానా ప్రమోట్ చేశారు. నిజంగా రానా లేకుంటే తెలుగు ఇండస్ట్రీకి ఇంత పెద్ద ప్రమోషన్ ఈతరంలో దక్కేది కాదేమో. ఎందుకంటే మేకింగ్ కన్నా మూవీని జనం దగ్గరకు తీసుకెళ్లడం చాలా ముఖ్యం కదా. బాహుబలి తర్వాత కూడా రానా ఇతర తెలుగు సినిమా లకు పాన్ ఇండియా ప్రమోషన్ లు ఇప్పించారు. హనుమాన్,కల్కి, మిరాయ్ లాంటి సినిమా లను బాలీవుడ్లో ప్రమోట్ చేయడమే కాదు వాటిలో కొన్నింటి కోసం స్వయంగా యాంకర్ రూపం సైతం ఎత్తాడు.
Also Read: తేజస్విని నందమూరి యాడ్ చేసిన కంపెనీ ఎవరిదో తెలుసా? బాలకృష్ణ చిన్న కుమార్తె ఆ యాడ్ ఎందుకు చేశారంటే?
కరణ్ కు లాభాల పంట- తెలుగు సినిమాల కోసం బాలీవుడ్ వేట
ట్రేడ్ వర్గాల ప్రకారం బాహుబలి వన్ ను కాస్త తక్కువ రేట్ కి కరణ్ జోహార్ హిందీ రిలీజ్ చేశారట. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో చాలా రెట్ల లాభాన్ని చూసారు కరణ్ జోహార్. రెట్టించిన ఉత్సాహం తో బాహుబలి 2 కూడా ఆయనే రిలీజ్ చేసి మళ్ళీ లాభాలు చూసారు. ఇప్పటినుంచి సౌత్ సినిమా లు ముఖ్యం గా తెలుగు సినిమాలు ఫై ఆయన శ్రద్ధగా దృష్టి పెడుతున్నారు. ఆయననే కాదు బాలీవుడ్ బడా ప్రొడక్షన్ సంస్థలు ఇదే దారిలో ఉన్నాయి. KGF, కాంతారా, పుష్ప లాంటి సినిమా ఫ్రాంచైజీ లకు బాలీవుడ్ లో పెద్ద ఎత్తున థియేటర్లు, రిలీజు లు దక్కాయంటే దానికి బాహుబలి సృష్టించిన ఇంపాక్ట్ నే కారణం. ఇంకా చెప్పాలంటే రానా దగ్గుపాటి ప్లే చేసిన చిన్న ట్రిక్ సౌత్ సినిమా తలరాతను మార్చింది అనడం లో అతిశయోక్తి లేదు. ఇప్పటికే చాలా తెలుగు సినిమాలను బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ వరకు తీసుకోవడానికి రానా సాయాన్నే కోరుకుంటున్నారు. అందుకే బాహుబలిలో రానా విలన్ అయినా తెలుగు ప్రొడ్యూసర్ల పాలిట రియల్ హీరో అనే చెప్పాలి.
Also Read: అల్లు శిరీష్ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ - మరి ఉపాసన సీమంతంలో అల్లు కుటుంబం ఎక్కడ?





















