Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
KK survey on Jubilee Hills by poll | జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ పార్టీ నిలుపుకుంటుందని కేకే సర్వేలో వెల్లడైంది.

Jubilee Hills By Poll Survey: హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు కీలకం కానున్నాయి. ఇది రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ప్రజల తీర్పు కానుంది. ఈ క్రమంలో ఎన్నికల సర్వే ఫలితాలను కిరణ్ కోటేటి ఏ(కేకే) ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి తిరుగులేదని కేకే సర్వేలో వెల్లడైంది. 55 శాతం ఓట్లతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, అదే సమయంలో అధికార కాంగ్రెస్ 37 శాతం ఓట్లకు పరిమితం కానుందని కేకే అంచనా వేశారు. బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది.
ఏపీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కేకే ఎన్నికల సర్వే అంచనాలు నిజమయ్యాయి. 2019లో కేకే చెప్పినట్లుగా వైసీపీ ప్రభంజనం సృష్టించగా, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయాన్ని ముందుగానే అంచనా వేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని జోన్ల వారీగా సర్వే ఫలితాలు
బొరబండ- బీఆర్‌ఎస్ 63.2, కాంగ్రెస్ 31.6, బీజేపీ 5.2 శాతం
రహమత్ నగర్- బీఆర్‌ఎస్ 45.6, కాంగ్రెస్ 51.1, బీజేపీ-3.3
శ్రీనగర్ కాలనీ- బీఆర్‌ఎస్ 61.9, కాంగ్రెస్ 33.3 శాతం, బీజేపీ 4.8
వెంగళరావు నగర్- బీఆర్‌ఎస్ 46.1, కాంగ్రెస్ 48.5, బీజేపీ-5.5 (సెటిలర్స్ ఎక్కువగా ఉండే డివిజన్)
ఎర్రగడ్డ- బీఆర్‌ఎస్ 61.6, కాంగ్రెస్ 31.7 శాతం, బీజేపీ 6.7 శాతం
యూసఫ్‌గూడ- బీఆర్‌ఎస్ 47, కాంగ్రెస్ 45.5, బీజేపీ-7.4 శాతం
షేక్‌పేట- బీఆర్‌ఎస్ 60.1, కాంగ్రెస్ 33, 6.9 శాతం
కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పార్టీ మద్దతు ప్రకటించింది. సొంతంగానూ నవీన్ యాదవ్‌కు నియోజకవర్గంపై పట్టుంది. గతంలో ఆయన మైనారిటీ ఓటర్లను సైతం ఆకట్టుకుని ఓటు బ్యాంకుగా మలుచుకున్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి 55 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బీజేపీ ఓట్లు సగానికి సగం తగ్గుతాయని, అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకోకపోవడంతో గులాబీ పార్టీ దాన్ని క్యాష్ చేసుకుందని సర్వేలో అంచనా వేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరగనుండగా, నవంబర్ 14న ఈసీ బైపోల్ ఫలితాలు ప్రకటిస్తుంది.
తెలంగాణ కేబినెట్ లోకి మహ్మద్ అజారుద్దీన్ ను తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం నియోజకవర్గంలో గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. మరోవైపు అధికారంలో ఉన్న పార్టీ కావడంతో నియోజకవర్గానికి మేలు జరుగుతుందేమో అనే ఫీలింగ్ ప్రజల్లో ఎప్పుడూ ఉంటుంది.






















