Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రచార హోరు- మాటల తూటాలతో బస్తీలను చుట్టేస్తున్న ముఖ్యులు
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయం సాధించాలని లక్ష్యంలో ముఖ్యనేతలంతా ప్రచారానికి వచ్చారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు రేవంత్, కిషన్ రెడ్డి, కేటీఆర్ ప్రచార రథం ఎక్కారు.

Jubilee Hills by-election: తెలంగాణ రాజకీయం మొత్తం జూబ్లీహిల్స్ చుట్టూ తిరుగుతోంది. మూడు ప్రధాన పార్టీలు ఉపఎన్నికల ప్రచారంపైనే ఫోకస్ పెట్టాయి. ఇంకా ప్రచారానికి పది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బడా నేతలు బస్తీలో ప్రచారం చేస్తున్నారు. దీంతో వింటర్‌లో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున ప్రచారం చేశారు.
ఇప్పుడు రంగంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగారు. కార్నర్ మీటింగ్స్‌తో ప్రజల మధ్యకు వచ్చారు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతూనే, రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను వారి ముందు పెడుతున్నారు. కేవలం మీటింగ్‌లకే పరిమితం కాకుండా నేరుగా వెళ్లి జనంతో మాట్లాడుతున్నారు.
స్థానికంగా ఉండే సమస్యలు ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి మార్గాలు చూపిస్తామంటున్నారు. నవీన్ యాదవ్, అజారుద్దీన్ ఇద్దరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని చెప్పుకొస్తున్నారు. స్థానికంగా ఉండే ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్‌ఎస్ బీజేపీ కలిసే పని చేస్తున్నాయని వారిని నమ్ముకుంటే కచ్చితంగా ఇబ్బంది పడతారని అంటున్నారు. వారి మాటలకు బోల్తాపడొద్దని హితవు పలుకుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు కౌంటర్‌గా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో డిపాజిట్ దక్కకుండా ఓడిస్తేనే వారు ఇచ్చిన ఆరు హామీలు కచ్చితంగా అమలు చేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఆయన కూడా షేక్‌పేటలో తొలి రోడ్‌షో నిర్వహించారు. బాకీ కార్డులు చూపించి ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు వాటి గురించి నిలదీయాలని చెబుతున్నారు.
ఓడిపోతున్నామని తెలిసినందున ఓటర్లను మభ్యపెట్టేందుకు అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇచ్చారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత విజయం ఖాయమైపోయిందని, అయితే మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ ఎంత కలిసి వచ్చినా గెలిచేది లేదని అభిప్రాయపడ్డారు. సాధారణంగా గెలవలేమని చెప్పి రౌడీయిజం చేస్తున్నారని, అందుకే ఆకు రౌడీని పోటీలో నిలబెట్టారని నవీన్ యాదవ్‌ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్క ఇంటిని కూడా కట్టి ఇవ్వలేదని, కానీ హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో చేసిన మంచిని, రెండేళ్లలో కాంగ్రెస్ పాలనలో లోపాలు, అమలు కాని హామీలు ప్రస్తావిస్తూ ఓటర్లను మెప్పించే ప్రయత్నాల్లో కేటీఆర్ ఉన్నారు. ఆ దిశగానే ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి.
కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌తో ప్రజల్లోకి వెళ్తుంటే... బీఆర్‌ఎస్ రోడ్‌షోలతో ఆకట్టుకుంటే.... బీజేపీ ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ తప్పులు ప్రజలకు తిప్పలు అన్నట్టు ఛార్జ్‌షీట్‌ను విడుదల చేయబోతోంది. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు నేతలంతా ఇంటింటికీ వెళ్లి ఓటర్ తలుపు తడుతున్నారు.
నేడు ఛార్జ్‌షీట్ విడుదల చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. నివీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కారని, ఎంఐఎం నిర్ణయించిన వ్యక్తిగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సహాయంతో జూబ్లీహిల్స్‌లో గట్టెక్కే ప్రయత్నాల్లో ఉందని ఆరోపిస్తున్నారు. పోటీలో బీఆర్‌ఎస్ లేనేలేదని, కేవలం ఈ పోటీ ఎంఐఎం, బీజేపీ మధ్యే ఉంటోందని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి లేకపోయినా చాలా మంచి చేస్తున్నామని జూబ్లీహిల్స్‌లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపిస్తే ప్రజలకు మరింత మంచి జరుగుతుందని తెలిపుతున్నారు.
ఇలా మూడు పార్టీల ముఖ్య నేతలు ఒకేసారి జూబ్లీహిల్స్ బస్తీల్లో తిరుగుతూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరో పది రోజుల్లో జరిగే ఎన్నికల్లో విజయం సాధించి జూబ్లీహిల్స్‌లో జెండా ఎగరేయాలని చూస్తున్నాయి.





















