AP Weather Updates: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మరో రెండు రోజుల్లో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Andhra Pradesh News | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని.. నేడు తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో 2 రోజుల్లో వర్షాలు కురిసే అకాశం ఉంది.

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాడు (జనవరి 7న) నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. గురువారం రాత్రికి ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారి తమిళనాడు తీరం వైపు పయనించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్‌పై పెద్దగా ప్రభావం చూపదని, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, ఈ వాయుగుండం ప్రభావంతో శుక్రవారం, శనివారం దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న చలి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Synoptic features of weather inference of Andhra Pradesh dated 06-01-2026 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/0dY1qCnXxT
— MC Amaravati (@AmaravatiMc) January 6, 2026
సాధారణంగా బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినప్పుడు సముద్రం అలజడిగా ఉంటుంది. అందుకే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం అల్పపీడనం ఏపీపై అంతగా ప్రభావం చూపదు. తెల్లవారుజామున పొగమంచు వల్ల వాహనదారులు ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరో రెండు, మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కోత దశలో ఉన్న పంటలను కాపాడుకోవాలని మరియు ధాన్యం నిల్వల్లో జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు.
తెలంగాణలో చలిగాలుల హెచ్చరిక
గత కొన్ని రోజులుగా ఉదయం పూట పొగమంచు ఉన్నప్పటికీ, చలి తీవ్రత నుండి లభించిన స్వల్ప ఉపశమనం ముగియనుంది. తెలంగాణలో రెండో దశ చలిగాలుల ప్రభావం మొదలవుతుంది. జనవరి12వ తేదీ వరకు రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరుగుతుందని, డిసెంబర్ నెలలో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రతల స్థాయికి మళ్లీ పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వారం రోజుల పాటు ప్రజలు చలితో ఇబ్బంది పడతారు. .
ఈ మలిదశ చలిగాలుల ప్రభావంతో కేవలం రాత్రిపూట మాత్రమే కాకుండా, పగటి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గి 25 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం కానున్నాయి. ముఖ్యంగా జనవరి 7, 8 తేదీలలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోనుంది. దీనివల్ల పగటివేళ వాతావరణం మేఘాలతో, పొగమంచుతో నిండిపోయి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.






















