Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
2025 సంవత్సరం ఏమంటూ స్టార్ట్ అయ్యిందో కానీ ఈ ఇయర్ మొత్తం కూడా తొక్కిసలాట ప్రమాదాలు. పాపం ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అన్నీ దురదృష్టకర ఘటనలే అయినా అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం అంటూ కొన్ని ఘటనలకు కారణంగా మిగిలితే ...ప్రజల అత్యుత్సాహం..అక్కర్లేని తాపత్రయం, మితిమీరిన భక్తి లాంటివి కొన్ని ఘటనలకు కారణం అయ్యాయి. 2025లో మర్చిపోలేని ప్రజల ప్రాణాలు తీసిన స్టాంపేడ్స్ ఇవే.
1. వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, తిరుపతి
జనవరి 08, 2025
2025 ఏడాది ప్రారంభంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుందామని టోకెన్ల కోసం క్యూలు కట్టిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి జనవరి 8న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీ ప్రభుత్వం ఈ ఘటనపై జ్యూడీషియల్ ఎంక్వైరీ వేసింది. టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా పోటీపడటమే ప్రమాదానికి కారణంగా అధికారులు తేల్చారు.
2. మహా కుంభమేళా తొక్కిసలాట, ప్రయాగ్ రాజ్
జనవరి 29, 2025
ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన మహాకుంభమేళా రికార్డు స్థాయిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. సుమారు 50 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన ఈ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది. జనవరి 29న అమృత్ స్నానాల కోసం వేచిచూస్తున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 30మంది చనిపోయారు. అనధికారిక లెక్కల ప్రకారం కనీసం 80మంది వరకూ చనిపోయి ఉంటారని వివిధ వార్తా సంస్థలు కోట్ చేశాయి. రోజుకు కోటి మంది తరలివచ్చే మహాకుంభమేళా మృతుల సంఖ్యను లెక్కపెట్టడం కూడా కష్టంగా మారిపోయింది అప్పుడు.
3. ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ తొక్కిసలాట, బెంగుళూరు
4 జూన్ 2025
18ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్ ను ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు అనుకోని వివాదంలో చిక్కుకుపోయింది. విరాట్ కొహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ తొలిసారి ఐపీఎల్ కప్ అందుకున్న సందర్భాన్ని అభినందించేందుకు ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాటగా మారి 11మంది క్రికెట్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దురదృష్టకర ఘటన కర్ణాటక ప్రభుత్వంపైనా, ఆర్సీబీ జట్టు యాజమాన్యంపైనా మాయని మరకగా మిగిలిపోయింది.
4. విజయ్ ఎన్నికల ర్యాలీ తొక్కిసలాట, కరూర్
27 సెప్టెంబర్ 2025
హీరో కమ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. విజయ్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు ఆయన తిరిగే వెళ్లేప్పుడు తమ అభిమాన నటుడిని కలిసేందుకు చేసిన ప్రయత్నం 41మంది ప్రాణాలు తీసింది. 100 మంది కార్యకర్తలు, విజయ్ అభిమానులు గాయపడ్డారు.
5.వెంకటేశ్వరస్వామి గుడి తొక్కిసలాట, కాశీబుగ్గ
1 నవంబర్ 2025
ఇక ఆఖరుది కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి గుడిలో కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని దర్శనాలు కోసం భక్తులు భారీగా తరలిరాగా అక్కడ తొక్కిసలాట జరిగింది. రెయిలింగ్స్ ఊడిపడిపోవటంతో 9మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.





















