Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

అమరావతి: ఏపీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులకు మోక్షం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. ఉగాది పండుగ రోజున ఆర్థిక శాఖ అధికారులతో పయ్యావుల భేటీ అయి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపులపై కసరత్తు చేపట్టారు. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేస్తామన్న ఆయన.. రూ.2 వేల కోట్ల మేర బిల్లుల చెల్లింపులు చేపట్టేందుకు ఏపీ ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది.
మొత్తం సుమారు 17 వేల మందికి బిల్లులు చెల్లించాలని ఏపీ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. 9 వేల మంది చిన్న కాంట్రాక్టర్లు, 8 వేల మంది నీరు-చెట్టు లబ్దిదారులకు బిల్లుల చెల్లింపులు చేయనున్నారు. దాంతో దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న వివిధ బిల్లులకు మోక్షం లభించనుంది. సాధ్యమైనంత మేరకు ఫిఫో పద్దతిన మొదట ఖర్చు చేసిన పనులకు నిధుల చెల్లింపులు జరగాలని మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు.
మొత్తం విడుదల చేస్తున్న రూ. 2000 కోట్లల్లో 90 శాతం చిన్న కాంట్రాక్టర్లకు చేరనుండగా, కేవలం 10 శాతం మాత్రమే పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లింపులు వెళతాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ. కోటి లోపు ఉన్న బిల్లులే టార్గెట్ గా ఆర్థిక శాఖ చెల్లింపుల ప్రక్రియ చేపట్టింది. ఇందులో నీరు-చెట్టు, గుంతలు లేని ఫ్రీ రోడ్లు, నాబార్డు పనులకు బిల్లుల చెల్లింపులు జరగనున్నాయి.
ఇరిగేషన్ మెయింటెనెన్స్ బిల్లులతో పాటు పోలవరం ప్రాజెక్టుకూ కొంత మొత్తం బిల్లుల విడుదల చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలన్న సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో పని చేస్తున్నాం అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా పెండింగ్ బిల్లులు అన్ని దశలవారీగా చెల్లిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గత 3, 4 నుంచి పెండింగులో ఉన్న బిల్లులను చెల్లిస్తున్నామని తెలిపారు.






















