Hyderabad Regional Ring Road: త్వరగా ఆర్ఆర్ఆర్‌కు భూ సేకరణ, మూడేళ్లలో నిర్మాణం పూర్తి- రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
Hyderabad RRR | హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు సాధ్యమైనంత త్వరగా భూ సేకరణ చేయాలని, రైతులకు వీలైనంత ఎక్కువ పరిహారం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Hyderabad Regional Ring Road | హైదరాబాద్: ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. రీజనల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగానికి సంబంధించి భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్నారు. ఆర్బిట్రేటర్లుగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం పరిహారం వచ్చేలా చూడాలన్నారు. ఆర్ఆర్ఆర్ (Hyderabad Regional Ring Road), జాతీయ రహదారుల భూ సేకరణ, పరిహారం, హ్యామ్ (Hybrid Annuity Model) విధానంలో రహదారుల నిర్మాణం, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై రేవంత్ రెడ్డి సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ప్రయోజనాలను రైతులకు వివరించి, భూ సేకరణ
‘భూ సేకరణకు సంబంధించి స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించాలి, తరచూ రైతులతో సైతం సమావేశమై ఆయా రహదారుల నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంతో భూ సేకరణ వేగవంతం చేయవచ్చు. ఆర్ఆర్ఆర్ (దక్షిణ భాగం)కు ఎన్‌హెచ్ఏఐ (NHAI) ప్రాథమికంగా ఆమోదం తెలిపింది కనుక హెచ్ఎండీఏతో అలైన్‌మెంట్ చేయించాలి. హైదరాబాద్ ను కలిపే 11 రహదారులకు ఆటంకం లేకుండా రేడియల్ రోడ్లు నిర్మించాలి. ఈ రోడ్లకు సంబంధించి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలం కావడంతో పాటు ఔటర్ రింగు రోడ్డు (Hyderabad Outer Ring Road), ఆర్ఆర్ఆర్ అనుసంధానంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని’ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.
మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మీదుగా సాగే నాగ్‌పూర్- విజయవాడ (NH 163G) రహదారి, ఆర్మూర్- జగిత్యాల- మంచిర్యాల రహదారి (NH 63), జగిత్యాల నుంచి కరీంనగర్ (NH 563) రహదారుల నిర్మాణంతో పాటు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి భూ సేకరణ, అటవీ అనుమతుల్లో అడ్డంకుల తొలగింపునకు అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రహదారుల నిర్మాణంలో అటవీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతోందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు డోబ్రియల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరిస్తాం, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఆర్ అండ్ బీ, అటవీ శాఖ (Forest Department) నుంచి ఈ సమస్యల పరిష్కారానికి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారితో 10 రోజులకోసారి సమీక్షించి త్వరగా క్లియరెన్స్ వచ్చేలా చూడాలన్నారు. ఇక్కడ కాకపోతే సంబంధిత శాఖల మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులు, అధికారులతో సమావేశమై అనుమతులు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అండర్ పాస్‌ల నిర్మాణాన్ని విస్మరిస్తుండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆ సమస్య ఎదురుకాకుండా నిర్మాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ ఆదేశించారు. రైతులు కిలోమీటర్ల మేర వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చూడాలన్నారు.
హ్యామ్ విధానంలో రహదారుల నిర్మాణం
హ్యామ్ విధానంలో రోడ్లు, భవనాల శాఖ పరిధిలో 12 వేల కిలోమీటర్లు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 17,700 కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాలి. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకోవాలి. ఇందుకు సంబంధించి కన్సల్టెన్సీల నియామకం, డీపీఆర్ ల తయారీతో రహదారుల నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 3 సంవత్సరాలలో రహదారుల నిర్మాణం పూర్తికావాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టాలి, కూలిన వంతెలను వెంటనే నిర్మించాలని ఆదేశించారు. ఈ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు వెంటనే విడుదల చేసి, కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌ను పొందాలని ఆర్థిక శాఖ అధికారులకు రేవంత్ సూచించారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలతో సహా ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాలని.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పు ఉండేలా డిజైన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. ఇకపై రాష్ట్రంలో ఏ గ్రామానికి రోడ్డు లేదు అనే మాట తనకు వినపడొద్దని అధికారులతో అన్నారు.