(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం, ఆగిపోయిన రైళ్లు
Hyderabad Metro Rail: ముసారాంబాగ్ స్టేషన్‌లో ఒక్క రైలు ఆగిపోయిన కారణంగా, మిగతా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Hyderabad Metro: హైదరాబాద్ మలక్‌పేట సమీపంలోని ముసారాంబాగ్ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో రైలు నిలిచిపోయిందని తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే ఆగిపోయినట్లుగా మెట్రో అధికారులు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టినట్లుగా అధికారులు పేర్కొన్నారు. అయితే, ముసారాంబాగ్ స్టేషన్‌లో ఒక్క రైలు ఆగిపోయిన కారణంగా, మిగతా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు కూడా ఎక్కడికక్కడ స్టేషన్లలో వేచి ఉండాల్సి వచ్చింది.
నష్టాల్లోనే హైదరాబాద్ మెట్రో
మరోవైపు, మెట్రో సంస్థ తీవ్ర నష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. 2020-21లో రూ.1,766 కోట్ల మేర నష్టాలు మూటగట్టుకుంది. 2021 నుంచి క్రమంగా ప్రయాణీకుల రద్దీ పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రోజుకు 2.5 నుంచి 3 లక్షల మంది మెట్రోరైళ్లలో రాకపోకలు సాగిస్తున్నా ఆశించినంతగా నష్టాల నుంచి బయటపడలేకపోతున్నారు. 2021-22 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.1745 కోట్ల నష్టాలు వచ్చాయి.
Also Read: Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
లాక్‌డౌన్‌కు ముందు రోజుకు 4 లక్షల మంది మెట్రోలో ప్రయాణించేవారు. దీంతో సంస్థ లాభనష్టాలు లేని దశకు చేరుకుంది. వచ్చే ఏడేళ్లలో మొత్తం మెట్రోనే బ్రేక్ ఈవెన్‌కు వస్తుందని భావించగా కరోనాతో అంచనాలు రివర్స్ అయ్యాయి. 2020లో లాక్‌డౌన్ సమయంలో మెట్రోరైళ్లు 169 రోజులు డిపోలకే పరిమితం అయ్యాయి. పునః ప్రారంభం అయినా ఏ దశలోనూ ప్రయాణికులు సంఖ్య 2.20 లక్షలు దాటలేదు. మెట్రో మాల్స్ తెరిచినా కస్టమర్లు రాక ఆదాయం పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మెట్రో ఆదాయం రూ.386 కోట్లు మాత్రమే రాగా, ఖర్చు మాత్రం రూ.2,152 కోట్లు అయ్యింది. ఇందులో వడ్డీ చెల్లింపులకే రూ.1,412 కోట్లు ఉంటోంది.
ఈ ఏడాది జూన్ తర్వాత రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 5 లక్షలకు చేరుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. సెలవు రోజుల్లో ప్రవేశపెట్టిన రూ.59 టిక్కెట్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. ఐటీ కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలుకుతుండటంతో క్రమంగా ప్రయాణీకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ ప్రాజెక్టు రోజుకు 15 లక్షల మంది రాకపోకలు సాగించగలిగే సామర్థ్యంతో నిర్మించారు.