Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
Jeedimetla Woman Death: నాలుగు రోజుల క్రితమే మహిళ హత్యకు గురి కాగా ఎవరూ చూడకపోవడంతో ఆమె శవం కుళ్లిన స్థితికి వచ్చేసింది.
Jeedimetla News: హైదరాబాద్‌లో ఓ వివాహేతర సంబంధం మరో హత్యకు దారి తీసింది. జీడిమెట్లలోని ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో ఓ మహిళ దారుణమైన రీతిలో హత్యకు గురైంది. నాలుగు రోజుల క్రితమే ఆమె హత్యకు గురి కాగా, ఎవరూ చూడకపోవడంతో ఆమె శవం కుళ్లిన స్థితికి వచ్చేసింది. దుర్వాసనతో స్థానికులు పోలీసులకు చెప్పగా అప్పుడు విషయం బయటికి వచ్చింది. అయితే, ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తే నాలుగు రోజుల క్రితం ఆమెను హత్య చేసి పారిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం, కట్టువపల్లి గ్రామానికి చెందిన పెంచలయ్య కుమారుడు గోని ప్రసాద్ (35) వంట మాస్టర్ గా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఎల్లమ్మబండ దత్తాత్రేనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఆ గదికి ఓ మహిళ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేది. ఇలా సాగుతున్న క్రమంలోనే వంట మాస్టర్ గా పని చేస్తున్న ప్రసాద్ పడక పైనే ఆమె తల పగలగొట్టి హత్య చేసి పారిపోయాడు.
నాలుగు రోజుల తర్వాత ఆ గదికి సమీపంలో ఉన్న ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్న వ్యక్తికి ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తి హత్య జరిగిన విషయం గురించి చెప్పాడు. దాంతో అతను కాలనీ ప్రెసిడెంట్‌కు ఫోన్ చేశాడు. అతను వెంటనే స్పందించి డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. స్పందించిన జగద్గిరిగుట్ట పోలీసులు దత్తాత్రేయ నగర్ కాలనీకి చేరుకొని సదరు గది తలుపులను పగలగొట్టారు.
లోపల పడకపై రక్తపు మడుగులో మహిళ శవం ఉండడం, దాని నుంచి అత్యంత దుర్వాసన వస్తుండడాన్ని గుర్తించారు. నాలుగు రోజులుగా తమ ఇంటి పక్క పోర్షన్‌లోనే శవం ఉందని తెలిసి స్థానికులు ఆశ్చర్యపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.
4 లక్షలు చోరీ, వాటి స్థానంలో నకిలీ నోట్లు
రెండు రోజుల క్రితం జీడిమెట్ల ఎస్ఆర్ నాయక్ కాలనీలోనే ఓ దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు బీరువాలో దాచిన రూ.4 లక్షలను ఇద్దరు మైనర్లు కాజేశారు. వాటిని వారు 20 రోజుల్లోనే ఖర్చు చేశారు. తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో నుంచి రోజూ కొంత డబ్బు తీసుకొని స్నేహితులతో జల్సాలు చేసుకున్నారు. తీసిన డబ్బు స్థానంలో నకిలీ నోట్లు పెట్టారు. 20 రోజుల తర్వాత బీరువాలో డబ్బులను పరిశీలించిన తల్లిదండ్రులు కంగుతున్నారు. డబ్బులు మొత్తం తగ్గాయి. పైగా నకిలీ నోట్లు ఉన్నాయని నోరెళ్లబెట్టారు. ఇద్దరు కుమారులను నిలదీయగా అసలు విషయం చెప్పారు. ఘటనపై జీడిమెట్ల పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చిన్నారులకు నకిలీ డబ్బులు ఎలా వచ్చాయి? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.