Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Madras High Court : తిరుపరంకుండ్రం కొండపై ఉన్న పురాతన శిలా స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించే వివాదంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను కొట్టివేసింది.

Madras High Court upholds lighting of Karthigai Deepam at Thiruparankundram: మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న పురాతన శిలా స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించే వివాదంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మరియు దర్గా కమిటీ దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు కొట్టివేసింది. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందన్న ప్రభుత్వ వాదనను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
శాంతిభద్రతలు కేవలం ఒక భ్రమ
తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ప్రభుత్వ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. శాంతిభద్రతల సమస్య అనేది ప్రభుత్వం సృష్టించిన ఒక ఇమాజినరీ ఘోస్ట్ అని, ఒక సమాజాన్ని మరొక సమాజంపై అనుమానించేలా చేయడానికి అధికారులు దీన్ని సాకుగా వాడుతున్నారని బెంచ్ వ్యాఖ్యానించింది. ఏడాదిలో ఒక రోజు ఒక స్తంభం వద్ద దీపం వెలిగిస్తే శాంతికి భంగం కలుగుతుందని ప్రభుత్వం భయపడటం హాస్యాస్పదమని పేర్కొంది. జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించడానికి కాకుండా, చర్చల ద్వారా వారి మధ్య సంబంధాలను మెరుగుపరిచే అవకాశంగా తీసుకోవాలని కోర్టు సూచించింది. రాజకీయ అజెండాల కోసం ప్రభుత్వం ఇలాంటి స్థాయికి దిగజారకూడదని ధర్మాసనం హితవు పలికింది.
చారిత్రక ఆధారాలు, ఆగమ శాస్త్రం
శిలా స్తంభం వద్ద దీపం వెలిగించడాన్ని ఆగమ శాస్త్రాలు నిషేధిస్తున్నాయనడానికి ఎటువంటి బలమైన ఆధారాలను అప్పీలుదారులు చూపలేకపోయారని కోర్టు తెలిపింది. దర్గా సమీపంలోని సదరు రాతి స్తంభం దర్గాకు చెందిందంటూ చేసిన వాదనలను కోర్టు దుర్మార్గమైనవి అని అభివర్ణించింది. ఎత్తైన ప్రదేశంలో దీపం వెలిగించడం అనేది హిందూ భక్తుల ఆచారం అని, భక్తుల కోరిక మేరకు ఆలయ యంత్రాంగం ఆ పని చేయకుండా ఉండటానికి ఎటువంటి కారణం కనిపించడం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి సున్నితమైన విషయాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించింది. అలాగే, గతంలో జరిగిన వివాదాల వల్ల ఈ కేసు ప్రభావితం కాదని స్పష్టం చేసింది. ఆ కొండ రక్షిత ప్రాంతం కాబట్టి, దీపం వెలిగించే సమయంలో ఎంతమంది వ్యక్తులు వెళ్ళాలి మ, ఇతర సాంకేతిక అంశాలను పురావస్తు శాఖ తో సంప్రదించి నిర్ణయించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు తిరుపరంకుండ్రం సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మేనేజ్‌మెంట్ దీపాన్ని వెలిగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ మద్రాస్ హైకోర్టు ఈ వివాదానికి పరిష్కారం చూపింది.
కొండపై దర్గా కూడా
తిరుపరంకుండ్రం కొండపై మురుగన్ దేవాలయం తో పాటు సిక్కందర్ బాదుషా దర్గా రెండూ ఉన్నాయి. కొండపై ఉన్న ఒక రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని భక్తులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అది దర్గాకు చెందిన ప్రాంతమని, అక్కడ దీపం వెలిగిస్తే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతాయని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. దీనిపై గతంలో సింగిల్ జడ్జి దీపం వెలిగించడానికి అనుమతినిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం, సింగిల్ జడ్జి ఆదేశాలను సమర్థించింది.





















