బ్యాడ్‌న్యూస్: దేశంలోనే నంబర్ 1 బైక్ Hero Splendor Plus ధర పెంపు, కొత్త ధరల లిస్ట్ ఇదిగో!
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే Hero Splendor Plus బైక్ ధరలు పెరిగాయి. వేరియంట్ వారీగా కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు, ఫీచర్లు, ఇంజిన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Hero Splendor Plus Price And Features: మన దేశంలో పల్లె నుంచి పట్నం దాకా సామాన్యుల జీవితంలో భాగమైన బైక్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు Hero Splendor Plus. మూడు దశాబ్దాలుగా నమ్మకానికి ప్రతీకగా నిలిచిన ఈ బైక్ ధరను స్వల్పంగా పెంచిన హీరో మోటోకార్ప్, సామాన్యులకు షాక్ ఇచ్చింది. పెరుగుతున్న తయారీ ఖర్చులు, విడిభాగాల ధరల ప్రభావంతో స్ప్లెండర్ ప్లస్ ధరలను సవరించాల్సి వచ్చిందని ఈ కంపెనీ ప్రకటించింది.
ఈ ధర పెంపు భారీగా లేకపోయినా, బడ్జెట్ బైక్ కొనాలనుకునే వారికి ఇది మాత్రం బ్యాడ్‌న్యూస్‌నే. వేరియంట్‌పై ఆధారపడి గరిష్టంగా రూ.250 వరకు పెంపు జరిగింది. అయితే ఈ పెంపు ఉన్నప్పటికీ, స్ప్లెండర్ ప్లస్ ఇంకా అందుబాటులోనే ఉందని చెప్పాలి.
ఇంజిన్ & పనితీరు
Hero Splendor Plusలో ఎలాంటి మెకానికల్ మార్పులు లేవు. ఇందులో అదే నమ్మకమైన 100cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ కొనసాగుతోంది. ఈ ఇంజిన్ 7.09 bhp శక్తి, 8.05 Nm టార్క్‌ను ఇస్తుంది. దీనికి 4-స్పీడ్ కాన్స్టెంట్ మెష్ గేర్‌బాక్స్ జత చేశారు. మైలేజ్, దీర్ఘకాలిక పనితీరు విషయంలో ఈ బైక్‌కి ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు ఉంది.
రైడ్ కంఫర్ట్ & నమ్మకం
ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉండటంతో రోజువారీ ప్రయాణాల్లో కంఫర్ట్ బాగానే ఉంటుంది. పల్లె రోడ్లు అయినా, పట్టణ ట్రాఫిక్ అయినా స్ప్లెండర్ ప్లస్ తన పని నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంది. అందుకే చాలామంది దీన్ని ‘లార్డ్ స్ప్లెండర్’గా పిలుస్తారు.
ధర పెంపు ఎందుకు?
గత కొంతకాలంగా స్ప్లెండర్ ప్లస్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2025లో బేస్ వేరియంట్ రూ.80,000 దాటిన సందర్భాలు కూడా ఉన్నాయి. సెప్టెంబర్ 2025లో అమలులోకి వచ్చిన GST 2.0 తర్వాత ధరలు కొంత స్థిరంగా ఉన్నా, తాజా తయారీ ఖర్చుల కారణంగా కంపెనీ ఈ స్వల్ప పెంపు చేసింది. కొనుగోలుదారులపై ఎక్కువ భారం పడకుండా ఉండేలా హీరో మోటోకార్ప్ జాగ్రత్త తీసుకుంది.
వేరియంట్ వారీగా కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు
Drum --- పాత ధర: ₹73,902 | కొత్త ధర: ₹74,152
i3S --- పాత ధర: ₹75,055 | కొత్త ధర: ₹75,305
125 Million Edition --- ₹76,437 (ధర మారలేదు)
Xtec --- పాత ధర: ₹77,428 | కొత్త ధర: ₹77,678
Xtec 2.0 (Drum) --- పాత ధర: ₹79,964 | కొత్త ధర: ₹80,214
Xtec 2.0 (Disc) --- పాత ధర: ₹80,471 | కొత్త ధర: ₹80,721
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)
స్ప్లెండర్ ప్లస్‌ను ఎందుకు నమ్మాలి?
ధర కొంచెం పెరిగినా, తక్కువ మెయింటెనెన్స్, మంచి మైలేజ్, నమ్మకమైన ఇంజిన్ కారణంగా స్ప్లెండర్ ప్లస్ ఇప్పటికీ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కమ్యూటర్ బైక్‌గా కొనసాగుతోంది. కొత్త బైక్ కొనాలనుకునే వారు ఈ ధర పెంపును పెద్దగా పట్టించుకోకుండా, మళ్లీ ఇదే బైక్ వైపు చూస్తారని చెప్పొచ్చు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















