Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
పగిడిద్ద రాజు కోయ గిరిజనుల ఆరాధ్య దైవం. పురాణాల ప్రకారం, పగిడిద్ద రాజు ఒక గిరిజన తెగకు నాయకుడిగా ఉండేవారు. మేడారం ప్రాంతాన్ని ఏలుతున్న ప్రతాపరుద్రుడి సైన్యంతో పోరాడే సమయంలో, తెగల విస్తరణ వల్ల ఆయన పూనగండ్ల ప్రాంతంలో స్థిరపడినట్లు చెబుతారు. అందుకే ఆయన గద్దె పూనగండ్లలో ఉంటుంది.
సమ్మక్క తల్లి మేడారం అడవుల్లో దొరికినప్పుడు, ఆమెను పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే, కాకతీయ చక్రవర్తులతో జరిగిన యుద్ధంలో పగిడిద్ద రాజు వీరోచితంగా పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయన వీరమరణం పొందిన ప్రాంతంగా అలాగే ఆయనను ఆరాధించే ప్రధాన కేంద్రంగా పూనగండ్లను పరిగణిస్తారు.
జాతరలో భాగంగా పగిడిద్ద రాజును పూనగండ్ల నుంచి మేడారానికి తీసుకురావడం ఒక ప్రధాన ఘట్టం. భర్త వేరే గ్రామంలో ఉండటం, భార్య సమ్మక్క మేడారంలో ఉండటం వల్ల వీరిద్దరి కలయికను ఒక ఉత్సవంగా జరుపుతారు. జాతర మొదటి రోజు పూనగండ్ల నుంచి పగిడిద్దరాజును 'పెట్టె' రూపంలో ఊరేగింపుగా మేడారానికి తీసుకువస్తారు. దీనిని "దేవతల ఎదురుకోలు" అని అంటారు. అంటే భార్యాభర్తలు మళ్ళీ కలుసుకోవడం అన్నమాట.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పూనగండ్ల గ్రామంలో ఉంది. పగిడిద్ద రాజుకు సిద్ధబోయిన వంశస్థులు పూజలు నిర్వహిస్తారు. పగిడిద్ద రాజు పూనగండ్ల నుంచి బయలుదేరినప్పుడే జాతర వాతావరణం మొదలవుతుంది.





















