Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసేందుకు అవసరమైన బలమైన కారణాలను స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వెదుక్కుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలను వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది.

Disqualification of YSRCP MLAs in Next Sessions: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరుపై స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు అనుసరిస్తున్న వ్యూహం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సభకు హాజరుకాకుండా ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో తీసుకోవడం నైతికంగా తప్పని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే నో వర్క్ - నో పే అనే నినాదాన్ని స్పీకర్ గట్టిగా వినిపిస్తున్నారు. సభకు రాకుండానే హాజరు పట్టికలో సంతకాలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతుండటం చూస్తుంటే, వైసీపీ ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉన్నట్లు కనిపిస్తోంది.
అనర్హతా వేటుకు అవసరమైన రూల్స్ రెడీ
రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. ఒక సభ్యుడు వరుసగా 60 పని దినాల పాటు సభాపతి అనుమతి లేకుండా సమావేశాలకు గైర్హాజరైతే, ఆ స్థానాన్ని ఖాళీగా ప్రకటించే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పదేపదే ఈ '60 రోజుల నిబంధన'ను గుర్తు చేయడం వెనుక వ్యూహాత్మక ఆలోచన కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ గడువు ముగిసే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం ద్వారా, ప్రతిపక్షానికి కోలుకోలేని దెబ్బ తీయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్యేలకు సానుభూతి రాకుండా ప్రభు్తవ వ్యూహం
సాధారణంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం, రాజ్యాంగ ఉల్లంఘన అనే రెండు అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. సభకు రాకుండా జీతాలు తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేనని, ఓట్లేసిన ప్రజల సమస్యలను సభలో వినిపించకపోవడం రాజ్యాంగ ద్రోహమని ప్రచారం చేయడం ద్వారా ప్రజా వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతోంది. ప్రజల్లో ఈ అంశంపై చర్చ మొదలైతే, అనర్హత వేటును ప్రజలే సమర్థిస్తారనేది ప్రభుత్వ అంచనా. ఎథిక్స్ కమిటీ విచారణ ఈ ప్రక్రియలో అత్యంత కీలకంగా మారింది. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా, వారి పేరుతో సంతకాలు ఎలా జరిగాయనే అంశంపై ఫోరెన్సిక్ విచారణకు కూడా వెనుకాడబోమని ప్రభుత్వం సంకేతాలిస్తోంది. ఒకవేళ దొంగ సంతకాలు జరిగినట్లు నిరూపితమైతే, అది కేవలం అనర్హతకే పరిమితం కాకుండా క్రిమినల్ చర్యలకు కూడా దారి తీయవచ్చు. ఇది వైసీపీ ఎమ్మెల్యేలను నైతికంగా ఆత్మరక్షణలో పడేసే అవకాశం ఉంది.
వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది?
వైసీపీ కూడా ఈ పరిణామాలను గమనిస్తూనే ఉంది. ప్రభుత్వం వేటు వేసే వరకు వేచి చూడటం కంటే, వ్యూహాత్మకంగా రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజా క్షేత్రంలోకి వెళ్లడం మేలని ఆ పార్టీలోని కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే, అనర్హత వేటు పడితే దాన్ని కోర్టుల్లో సవాలు చేసే వెసులుబాటు ఉంటుంది కానీ, ప్రజల దృష్టిలో మాత్రం ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం చాలా తెలివిగా రాజ్యాంగబద్ధత అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు కానున్నాయి. స్పీకర్ కార్యాలయం నుండి వెలువడే నిర్ణయాలు రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలకు ఉపఎన్నికలను అనివార్యం చేసేలా కనిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై పోరాడటానికి సభను వేదికగా చేసుకోని పక్షంలో, రాజ్యాంగం కల్పించిన అధికారాలను ఉపయోగించి గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏమాత్రం వెనకాడబోమని స్పష్టం చేస్తోంది.





















