Telangana WEF 2026: టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రశంసలు! తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం! యువతకు నైపుణ్యాలపై శిక్షణ!
Telangana WEF 2026: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్, స్కిల్ యూనివర్సిటీపై సిస్కో ప్రతినిధులు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.

Telangana WEF 2026: తెలంగాణలో యువతకు వివిధ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ (TASK), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) ప్రారంభించిందని, ఇది చాలా గొప్ప ఆలోచన అని సిస్కో గ్లోబల్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గై డీడ్రిచ్ ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)–2026 సమావేశాల సందర్భంగా దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం సిస్కో సంస్థ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణలో సిస్కో చేపట్టబోయే పనులపై చర్చించారు.
సిస్కో సీనియర్ అధికారి గై డీడ్రిచ్ మాట్లాడుతూ, 2025 మార్చిలో టాస్క్, స్కిల్ యూనివర్సిటీతో కుదిరిన ఒప్పందాల తర్వాత ఆశించిన ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంతో ధైర్యంగా ప్రారంభించిన గొప్ప ఆలోచన టాస్క్ అని ఆయన కొనియాడారు. ఈ అవగాహన ఒప్పందాల ద్వారా యువతకు కంప్యూటర్ నెట్‌వర్క్ లు, సైబర్ సెక్యూరిటీ, ఆధునిక టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ శిక్షణతో విద్యార్థులు చదువు పూర్తికాగానే ఉద్యోగాలు సంపాదించుకునే స్థాయికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను భవిష్యత్తులో ఉద్యోగాలు, పరిశ్రమలు, పెట్టుబడులు ఎక్కువగా వచ్చే రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి ‘స్విస్ మాల్’
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, స్విట్జర్లాండ్‌లోని వాడ్ (Vaud) రాష్ట్ర ముఖ్యమంత్రి క్రిస్టెల్ లూసియర్ బ్రోడార్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారత్–స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సహకార పెంపుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్‌ను స్విస్ ప్రతినిధులకు వివరించారు.
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి ప్రతిపాదించగా, స్విస్ బృందం వెంటనే సానుకూలంగా స్పందించింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఫుట్‌బాల్ ఆటగాళ్లే కావడంతో, క్రీడల రంగంలో భాగస్వామ్యంపై కూడా విస్తృతంగా చర్చించారు. క్రీడా శిక్షణ, మౌలిక వసతుల అభివృద్ధిలో కలిసి పనిచేయవచ్చని అభిప్రాయపడ్డారు.
సంస్కృతి, విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ రంగాల్లో ముఖ్యంగా హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, క్రీడల విభాగాల్లో పరస్పర సహకారానికి అవకాశాలపై లీడర్లు అభిప్రాయాలు పంచుకున్నారు. రిటైల్ , లైఫ్ సైన్సెస్‌లో రంగాల్లో అవకాశాలపై చర్చించారు. మహిళా సాధికారతకు సంబంధించి స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలపై స్విస్ బృందం ఆసక్తి కనబరిచింది. సహకార అంశాలు పరిశీలించేందుకు త్వరలోనే స్విట్జర్లాండ్ బృందం హైదరాబాద్‌కు వస్తుందని వాడ్ రాష్ట్ర పరిశ్రమలు, ఆర్థిక శాఖ మంత్రి ఇసబెల్ మోరెట్ తెలిపారు.






















