Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Kamareddy Crime News:వందల సంఖ్యలో కుక్కలను చంపిన ఘటన మరువక ముందే మరో దారుణం జరిగింది. ఈసారి కోతులపై విష ప్రయోగం చేశారు. ఇది కూడా కామారెడ్డిలోనే జరగడం ఆందోళన కలిగిస్తోంది.

Kamareddy Crime News: కామారెడ్డి జిల్లాలో కోతులపై విష ప్రయోగం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ దారుణంతో దాదాపు పదిహేను వరకు కోతులు మృతి చెందాయి. మరికొన్నింటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పశువైద్యులు వాటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
బిక్కనూరు మండలం అంతంపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఊరు శివారు ప్రాంతంలో కోతులను విడిచి పెట్టి వెళ్లారు. వాటిలో కొన్ని వెళ్లిపోగా, మరికొన్ని మతిస్థిమితం లేకుండా పడి ఉన్నాయి. వీటిలో కొన్ని మృతి చెందాయి. దీన్ని గమనించిన స్థానికులు పోలీసుల, అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
కోతుల పరిస్థితి గమనించిన అధికారులు వాటికి వైద్య సేవలు అందించారు. వాటిలో కొన్ని కోలుకోగా మరికొన్ని ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు రెండు వందల వరకు కోతులను అక్కడ వదిలి వెళ్లినట్టు గుర్తించారు.
గతంలో ఇదే జిల్లాల్లో కుక్కలకు విషం పెట్టిన ఘటన కలకలం రేపింది. దీనిపై కేసులు నమోదు చేశారు. విచారణ సాగుతోంది. ఇలాంటి దుర్ఘటనలు పెరిగిపోవడంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క కూా దీనిపై వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పనులు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తామని ఎవరినీ వదిలిపెట్టేది లేదని అన్నారు.





















