Rohit Vs Gambhir: రోహిత్ తో గంభీర్ కి విబేధాలు.. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తో కూడా.. బీసీసీఐ క్లారిటీ..!
గత కొంతకాలంగా టీమిండియాలో లుకలుకలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూంలోని విషయాలు బయటకు వెళ్లడంపై కోచ్ గంభీర్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Team India Rifts: గతేడాది నుంచి మొదలు పెడితే ఈ ఏడాది తొలివారం వరకు భారత టెస్టు జట్టుకు చాలా కష్టంగా గడిచింది. ముఖ్యంగా 2024 సెకండ్ హాఫ్ లో నిరాశ జనక ప్రదర్శనతో అభిమానులను ఉస్సూరుమనిపించింది. ముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ అయ్యి, దశబ్ధాలపాటు టెస్టు విజయమే ఎరుగని కివీస్ కు ఏకంగా టెస్టు సిరీస్ నే అప్పగించింది. ఇది చాలదంటూ ఆస్ట్రేలియా పర్యటనలో 1-3తో ఓడిపోయి, పదేళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)ని పువ్వుల్లో పెట్టి మరీ కంగారూలకు అప్పగించింది. దీనికంతటికీ కారణం సీనియర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మే కారణమని విమర్శలు వచ్చాయి. మరోవైపు గంభీర కూడా తల తిక్క టీమ్ సెలెక్షన్ తో జట్టుకు పరాజయాలు వచ్చాయని పలువురు బలంగా నమ్మారు. ఈ క్రమంలో గంభీర్ కు ఇటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, అటు రోహిత్ తోనూ విబేధాలు వచ్చినట్లు కథనాలు వచ్చాయి. దీనిపై తాజాగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా క్లారిటీ ఇచ్చారు.
ఫామ్ టెంపరరీ విషయం..
ఇక ఈ విబేధాలన్నీ కట్టు కథలేనని రాజీవ్ శుక్లా తేల్చారు. ముఖ్యంగా ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం, ఫామ్ లోకి రావడం సాధారణమైన విషయాలేనని పేర్కొన్నారు. రోహిత్ లాంటి ఆటగాళ్లకు ఫామ్ చాలా చిన్నవిషయమని, ఒకవేళ తాను ఫామ్ లో లేనని తెలిస్తే సిడ్నీ టెస్టులో లాగా హుందాగా జట్టు నుంచి తప్పుకుంటారని తెలిపారు. ఖోఖో ప్రపంచకప్ ప్రారంబోత్సవ వేడుకలకు వచ్చిన ఆయన పై విధంగా మాట్లాడారు. ఇక జట్టులో ఎలాంటి విబేధాలు లేవని, అంతా సవ్యంగానే ఉందని పేర్కొన్నారు. మరోవైపు గత కివీస్ టూర్ నుంచి అటు కోహ్లీ, ఇటు రోహిత్ ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆసీస్ టూర్లో వీళ్ల వైఫల్యాలు పీక్స్ కు చేరుకున్నాయి. ఐదు టెస్టులాడిన కోహ్లీ కేవలం 190 పరుగుల పైబడి మాత్రమే చేశాడు. ఇక రోహిత్ మూడు టెస్టులాడి కేవలం 31 పరుగులు సాధించాడు. దీంతో వీరిద్దరిని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే ఆఖరి చాన్స్..
వచ్చేనెలలో ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో జరుగుతుంది. దీనికి సన్నాహకంగా ఇంగ్లాండ్ తో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఇందులో సత్తా చాటి, మెగాటోర్నీలోనూ చక్కగా ఆడతేనే ఇరువురు సీనియర్ల భవిష్యత్తుకు ఢోకా ఉండదు. లేకపోతే వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఫామ్ లోకి రావడం కోసం రోహిత్ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ముంబై జట్టు తరపున ఆడాలని కూడా తను నిర్ణయించుకున్నట్లు సమాచారం. రోహిత్ తో పాటు యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్ కూడా దేశవాళీల్లో ఆడతారాని కథనాలు వస్తున్నాయి. అయితే విరాట్ కోహ్లీ.. తన సొంత రంజీ జట్టు ఢిల్లీ తరపున ఆడతాడా లేదానే అనే దానిపై స్పష్టత లేదు. ఢిల్లీ క్రికెట్ సంఘం కార్యదర్శి కూడా కోహ్లీ తిరిగి రంజీల్లో ఆడితే బాగుంటుందని పేర్కొన్నారు. ఏదేమైనా ఐపీఎల్ కు ముందే సినీయర్ల అంతర్జాతీయ భవిష్యత్తు పై స్పష్టత రానుంది.
Also Read: Ipl Vs Ranji: షాకింగ్.. ఐపీఎల్ కోసం రంజీ జట్టును స్కిప్ చేసిన వర్థమాన స్టార్.. బీసీసీఐ కన్నెర్ర..!