Dashanami Tradition: తీర్ధ, ఆనంద, హంస.. సన్యాసులకు, అఘోరాలకు ఈ పేర్లు ఎవరిస్తారు? దశనామి సంప్రదాయం అంటే ఏమిటి?
Dashanami Tradition of Ten Names: తీర్ధ, ఆనంద, హంస.. సన్యాసులకు, అఘోరాలకు ఈ పేర్లు ఎవరిస్తారు.. దశనామి సంప్రదాయం అంటే ఏమిటి?

Tradition of Ten Names also known as the Order of Swamis | పరమహంస యో'గానంద', రామకృష్ణ పరమ 'హంస ', యుక్తేశ్వర 'గిరి', రామానంద 'తీర్ధ '.. ఇలా సాధువులు సన్యాసులు అఘోరాలు వంటి వారి పేర్లు చివర ఉండే కొన్ని ప్రత్యేకమైన బిరుదులతో వారిని గుర్తిస్తూ ఉంటారు భక్తులు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో పెద్ద ఎత్తున కనబడుతున్న సాధు పురుషుల పేర్లు సామాన్యులకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఆ పేర్లు పెట్టుకునే విధానం వెనక ప్రాచీన సంప్రదాయమే ఉంది. వందల ఏళ్ళ క్రితం మొదలైన ఆ పద్దతినే "దశ నామీ " సంప్రదాయం" అంటారు.
ఆదిశంకరాచార్య స్థాపించిన "దశనామి" విధానం
చరిత్రకారులు చెప్పే దాని ప్రకారం ఆదిశంకరాచార్య ఈ "దశనామీ " సా. శ. 8వ శతాబ్దంలో ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. అంతకుముందు దేశవ్యాప్తంగా సాధువులు,సన్యాసులు "ఏకదండి " అనే పేరుతో పిలవబడుతూ యాత్రలు చేస్తూ ఉండేవారు. ఆత్మ రక్షణ కోసం చేతిలో ఒక కర్ర ను ధరించి మాత్రమే వీరి పర్యటనలు సాగుతూ ఉండేవి. సంచార జీవితం గడిపే వీరికి స్థానిక రాజులు పన్నుల నుండి మినహాయింపు ఇచ్చేవారు. "హైందవమత స్వర్ణ యుగం " పిలవబడే సా. శ. 320-650 (గుప్తుల కాలం ) నాటికే ఈ "ఏకదండి" సంప్రదాయం ఉండేది. అయితే ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్య వచ్చాక "అద్వైతాన్ని" బాగా ప్రమోట్ చేసారు.
దేశం నలుదిక్కుల్లోనూ నాలుగు పీఠాలు స్థాపించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ సంచారం లేని సన్యాసులతోపాటు, వివిధ పీఠాలను ఆశ్రయించి ధర్మ పరిరక్షణ చేసే సాధువుల కోసం కొన్ని సంప్రదాయాలు ఏర్పాటు చేశారు. అలా వివిధ ఆశ్రమాలకు బద్దులై ఉండే సాధు సంతతిని గుర్తించే విధంగా వారి పేరు చివర ప్రత్యేకమైన బిరుదు ఉండేలా " దశ నామీ" సంప్రదాయాన్ని ఆయన ఏర్పాటు చేశారు. దాని ప్రకారం సన్యాసులకు ఉండే పది రకాలైన పేర్లను తమ పేరు చివర ధరించి గురువులుగా మారుతారు. ఆ పది పేర్లు ఇవే..!
1) గిరి/పర్వత
2)పూరీ
3)తీర్ధ
4)అరణ్య /వన
5)సాగర
6)సరస్వతి
7)భారతి
8)ఆశ్రమ
9)ఆనంద
10)హంస
గురువుల పేరు చివర ఉండే "బిరుదు " ను బట్టి వారు ఏ సంప్రదాయానికి చెందినవారు అనేది స్పష్టంగా తెలుస్తుంది అని ఆధ్యాత్మికవేత్త 'పరమహంస యోగానంద 'రాసిన సుప్రసిద్ధ ఆత్మకథ " ఒక యోగి ఆత్మకథ" లో సైతం పేర్కొన్నారు. ఉదాహరణకు ఏదైనా కొండకు దగ్గరలో ఉండే ఆశ్రమానికి సంబంధించిన గురువులు "గిరి " లేదా "పర్వత" అనీ ఏదైనా తీర్థక్షేత్రానికి నికి దగ్గరలో ఉండే ఆశ్రమానికి చెందిన వారు "తీర్ధ " అనే బిరుదు చేర్చుకోవడం ద్వారా వారు ఏ ఆశ్రమ విధానానికి చెందినవారు అనేది స్పష్టంగా తెలిసేది.
నాగ సాధువుల్లోనూ " దశనామీ " సంప్రదాయం
అఘోరాలు,నాగ సాధువులు ఎప్పటినుంచో ఉన్నా 16వ శాతాబ్దం లో మొగలుల హిందూ వ్యతిరేక చర్యలను ఎదుర్కోవడానికి బెంగాల్ ప్రాంతానికి చెందిన "మధు సూదన సరస్వతి " నాగ సాధువుల్లోనూ 'దశనామీ ' సంప్రదాయం ఏర్పాటు చేసి "అఖాడా" లు ఏర్పాటు చేశారు. వివిధ "అఖాడా "ల కింద నాగ సాధువులకి ఆయుధాలతో శిక్షణ ఇప్పించి హిందూ ధర్మ రక్షణకోసం ఒక ప్రత్యేకమైన సైన్యంలా మార్చారని చారిత్రక కథనం. కుంభమేళాకు ఈ నాగసాధువులే ప్రత్యేకమైన ఆకర్షణ.
కఠినమైన నియమాలు
ఒక్కసారి సన్యాసం తీసుకుని " దశనామి" సంప్రదాయం లోకి ప్రవేశించాక సదరు గురువు చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. నేలపైనే నిద్రపోవడం, చన్నీటి స్నానం ఒక్క పూటే భోజనం చేయడం, కేవలం 7 ఇళ్ల నుండి మాత్రమే బిక్ష స్వీకరించడం వంటి కఠినమైన విధానాలతో వారు జీవనం సాగించాల్సి ఉంటుంది. అలా ఉంటారు కాబట్టే సనాతన ధర్మంలో "దశనామీ" సంప్రదాయ గురువులకు ఎంతో గౌరవం లభిస్తుంది అంటారు ఆధ్యాత్మికవేత్తలు.





















