Chicken Over Rice Recipe : డైట్లో ఉన్నప్పుడు చికెన్ బిర్యాని తినాలనిపిస్తే.. ఈ చికెన్ ఓవర్ రైస్‌ని ట్రై చేయండి, లో క్యాలరీ హెల్తీ రెసిపీ ఇదే
Low Calorie Diet Chicken Rice : డైట్లో ఉన్నప్పుడు చాలామందికి క్రేవింగ్స్ ఎక్కువైతాయి. అలా డైట్లో ఉన్నప్పుడు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తే ఈ టేస్టీ రెసిపీ ట్రై చేసేయండి.

Healthy Chicken Over Rice Recipe : చికెన్ బిర్యానీ తినాలనిపించినప్పుడు మీరు డైట్ కారణంగా తినలేకపోతున్నారా? అయితే మీరు ఈ టేస్టీ చికెన్ ఓవర్ రైస్‌ని ట్రై చేయవచ్చు. దీనిని తయారు చేయడం చాలా తేలిక. బ్యాచిలర్స్ కూడా ఇంట్లో దీనిని వండుకొని టేస్టీగా లాగించేసి.. బిర్యానీ క్రేవింగ్స్ దూరం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- చికెన్ - 350 గ్రాములు (బోన్‌లెస్)
మారినేషన్ కోసం
- కారం - 2 టీస్పూన్లు
- ఉప్పు - రుచికి తగినంత
- పెప్పర్ - చిటికెడు
- జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
- గరం మసాలా - 1 టీస్పూన్
- పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
- ఒరిగానొ - నచ్చితే వేసుకోవచ్చు (1 టీస్పూన్)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- నిమ్మరసం - అరచెక్క
- మొక్కజొన్న పిండి - 20 గ్రాములు
రైస్ కోసం..
- బాస్మతి రైస్ - 150 గ్రాములు
- బటర్ - 5 గ్రాములు
- ఉప్పు - రుచికి తగినంత
- పసుపు - అర టీస్పూన్
- ఒరిగానో - అర టీస్పూన్
- కారం - 1/2 టీస్పూన్
- నిమ్మరసం - అర చెక్క
- యాలకులు - 2
- బిర్యానీ ఆకు - 1
- నీళ్లు - 1 కప్పుకి 1.5 కప్పుల నీళ్లు వేయాలి.
తయారీ విధానం
ముందుగా చికెన్‌ను బాగా కడిగి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిలో కారం, ఉప్పు, పెప్పర్, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, ఒరిగానొ, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. ముక్కలకు పిండి బాగా పట్టిన తర్వాత దానిని ఓ గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి మేరినేట్ కానివ్వాలి. బాస్మతి రైస్‌ని కడిగి అరగంట ముందు నానబెట్టుకోవాలి.
చికెన్ మేరినేట్ అయిన తర్వాత పాన్ తీసుకుని స్టౌవ్ వెలిగించండి. దానిలో నెయ్యి వేసి వేడి అయిన తర్వాత చికెన్ వేసి ఉడికించుకోవాలి. పది లేదా పదిహేను నిమిషాల్లో చికెన్ ఉడికిపోతుంది. అప్పుడు చికెన్‌ని ఆ పాన్ నుంచి తీసేసి.. అదే పాన్‌లో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. రెండు నిమిషాలు దానిని వేయించుకుని ఇప్పుడు దానిలో నీళ్లు వేయాలి. కప్పు బియ్యానికి కప్పున్నర నీళ్లు ఇదే కొలత ఫాలో అవ్వాలి. దానిలో యాలకులు, బిర్యానీ ఆకు, ఒరిగానో, కారం, పసుపు ఇలా అన్ని వేసుకుని కలపాలి.
మొత్తం కలిపేసి మూత పెట్టుకోవాలి. అది ఉడికే సమయంలో ఓ గిన్నెలో పెరుగు తీసుకోవాలి. సాస్‌కోసం దీనిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పెరుగులో ఒరిగానో, గార్లిక్ పౌడర్, కొంచెం నిమ్మరసం, కొంచెం వెనిగర్ వేసుకోవాలి. చివర్లో కొద్ది నీళ్లు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే సాస్ రెడీ. అన్నం కూడా ఉడికిపోయి ఉంటే స్టౌవ్ ఆపేయండి.
ఓ ప్లేట్ తీసుకుని దానిలో రైస్ వేసి.. దానిపై ఉడికించిన చికెన్ ఫ్రై వేసుకోవాలి. లిట్యూస్ ఉంటే వాటి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్న టోమాటోను ముక్కలుగా కట్ చేసి పైన గార్నిష్‌గా వేసుకుని.. అనంతరం పెరుగుతో తయారు చేసిన సాస్ వేసుకోవాలి. అంతే బిర్యానీని తలదన్నే చికెన్ ఓవర్ రైస్ రెడీ.
దీనిలో కేలరీలు - 600 గ్రామలు ఉంటాయి. ప్రోటీన్ - 48 గ్రాములు, కార్బ్స్ - 74 గ్రాములు, ఫ్యాట్స్ - 12 గ్రాములు, ఫైబర్ - 4 గ్రాములు ఉంటాయి. ఫిట్‌గా ఉండాలనుకునేవారు.. బిర్యానీ తినలేకపోతున్నాని బాధపడేవారు ఈ హెల్తీ చికెన్ రైస్‌ని ట్రై చేయవచ్చు.
Also Read : బ్యాచ్‌లర్ స్టైల్ బోండాల రెసిపీ.. పల్లీ చట్నీ ఎలా చేశారో చూసేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

