Telangana Ration Cards: రేషన్ కార్డులపై మరో గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఉత్తమ్- మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామని వెల్లడి
New Ration Cards: తెలంగాణలో అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ రేషన్‌కార్డు అందజేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పాతరేషన్‌కార్డులేవీ తొలగించబోమని హామీ ఇచ్చారు.

Uttam Kumar Reddy: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందజేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పాత రేషన్‌కార్డులు తీసివేస్తారన్న అపొహలు నమ్మొద్దన్న ఆయన...ఏ ఒక్కరి రేషన్‌కార్డు తొలగించడం జరగదని హామీ ఇచ్చారు
అర్హులందరికీ రేషన్‌కార్డులు
తెలంగాణలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందజేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) అభయమిచ్చారు. కొత్త రేషన్‌కార్డుల కోసం పదేళ్లుగా పేదలు ఎదురుచూస్తున్నారని...వారందరి కోరిక నెరవేరబోతోందని ఆయన వెల్లడించారు. కులగణనలో నమోదు చేసుకున్న సమగ్ర వివరాల ఆధారంగానే రేషన్‌కార్డులు (Ration Cards)అందజేస్తామని ఆయన వెల్లడించారు. అర్హులైన వారి పేరు లిస్ట్‌లో లేకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. గ్రామసభల్లో మళ్లీ దరఖాస్తులు తీసుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డు అందజేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
పాత రేషన్‌కార్డులు తొలగించం
పాత రేషన్‌కార్డులు తొలగిస్తారంటూ కొందరు లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని....అలాంటివి ప్రజలెవ్వరూ నమ్మొద్దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రేషన్‌కార్డు తొలగించబోమని స్పష్టం చేశారు.పాత రేషన్‌కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేరుస్తామని హామీ ఇచ్చారు.
26 నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ
గణతంత్ర దినోత్సవ(Republic Day) కానుకగా ఈనెల 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు మరోమంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే అర్హుల జాబితా సిద్ధం చేశామన్నారు. దాదాపు 6.68 లక్షల కుటుంబాలకు కొత్తగా రేషన్‌కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.రేషన్‌కార్డుల పంపిణీకి ఇప్పటికీ ప్రక్రియ ప్రారంభమైందన్న మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)... గ్రామాల్లో సర్వే సైతం జరుగుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల కుటుంబాలు ఉండగా...ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. కొత్తగా అర్హత కలిగిన వారందరికీ కార్డులు ఇస్తామని తెలిపారు. రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకున్నా...ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని...ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇస్తే...ఆ తర్వాత పరిశీలన చేసి కొత్త కార్డులు ఇస్తామన్నారు.
ప్రభుత్వం నుంచి ఏ చిన్న పథకం పొందాలన్నా ముందుగా అడిగేది రేషన్‌కార్డే. గత పదేళ్లలో ఒక్కసారి కూడా రేషన్‌కార్డులు అందజేయకపోవడంతో...పేదలు రేషన్‌కార్డుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు వారి కలలు ఫలించనున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ (Congress)సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులను అందజేస్తోంది. ఇటీవలే నిర్వహించిన ఇంటింటి సర్వేతోపాటు...ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వం వివరాలు సేకరించింది.ఈనెల 20 నుంచి 24 వరకు గ్రామసభలు, బస్తీ సభలు నిర్వహించి అర్హుల పేర్లు వెల్లడించనుంది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారు చేయనున్నారు. జనవరి 26వ తేదీ నుంచి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 83 వేల285 మంది అర్హులు ఉండగా...వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 6 వేల647 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం రేషన్‌కార్డుల రూపురేఖలే మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం...ఇప్పుడు కొత్తగా ఇచ్చే కార్డులస్థానంలో కేవలం లేఖలు మాత్రమే అందజేయనున్నారు. ఆ తర్వాత పాత, కొత్త వారికి కలిపి అందరికీ కొత్త డిజైన్‌లో రేషన్‌కార్డులు పంపిణీ చేయనున్నారు.
Also Read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి భట్టి- 25 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా మరో పథకం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

