Sankranti 2025 Telugu Movies: సంక్రాంతి సినిమాల్ని వెంటాడిన సెకండాఫ్... బాలయ్య, వెంకీ, చరణ్ సినిమాల్లో అదే కామన్ ప్రాబ్లమ్
సంక్రాంతికి తెలుగులో 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదల కాగా... ఆ మూడింటిలోనూ వినిపించిన ఏకైక సమస్య సెకండాఫ్. ఎస్... ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏమిటంటే?
సంక్రాంతికి టాలీవుడ్‌లో రిలీజ్ అయిన మూడు సినిమాలు ఒక్క విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అత్యంత భీకర పోటీ మధ్య రిలీజ్ 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సెకండాఫ్‌లో ప్రేక్షకుల్ని నిరాశపరిచాయి. ఎలివేషన్ల మీద, ప్రొడక్షన్ మీద, ప్రమోషన్ల మీద పెట్టిన దృష్టి పూర్తిస్థాయిలో కథ మీద పెట్టలేదనేది ఆయా మూవీ టీంల మీద వస్తున్న క్రిటిసిజం.
'గేమ్ చేంజర్' విషయానికి వస్తే...
శంకర్ సినిమాలు అనగానే బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. 'జెంటిల్మెన్'లో అర్జున్ గతం కానీ, 'భారతీయుడు'లో సేనాపతి పోరాటాలు కానీ, 'అపరిచితుడు'లో రామం చెల్లి చనిపోయే సీను కానీ, 'జీన్స్'లో నాజర్ - రాధిక ఎపిసోడ్ గానీ ఇప్పటికీ ప్రేక్షకుల మైండ్‌లో నిలిచి పోయి ఆ సినిమాలను క్లాసిక్స్‌గా మార్చాయి. ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లేదంటే ఆడియన్స్ స్టన్ అయిపోయే బ్లాక్ ఒకటి పెట్టడంతో ఆయన సినిమాలకు క్రేజ్ తెచ్చి పెడుతూ ఉంటాడు. 'ప్రేమికుడు'లో ముకాబులా పాటలోని ఇన్విజిబుల్ మ్యాన్ స్టెప్స్, 'శివాజీ'లో గుండు బాస్ ఎపిసోడ్, 'ఓకే ఒక్కడు'లో హీరో తల్లిదండ్రులు చనిపోయే సీన్, మగధీర పాటలోని గ్రాఫిక్స్, 'రోబో'లో వందలాది రోబోలు ఎటాక్ చేసే సీన్... ఇలా ఏదో ఒక ప్రత్యేకత సెకండ్ హాఫ్ లో ఉండేలా చూసుకుంటూ ఫీట్లు కొట్టేవాడు శంకర్. అయితే 'గేమ్ చేంజర్'లో శంకర్ దెబ్బతింది ఇక్కడే. అప్పన్న ఎపిసోడ్లో రామ్ చరణ్ అద్భుతంగా నటించినా అది తొందరగా ముగిసిపోవడం, ఆ తర్వాత ఎలాంటి అద్భుత రసం లేకుండా కథనం ఫ్లాట్ గా వెళ్లిపోవడంతో ఇంటర్వెల్లో వచ్చిన హై కంటిన్యూ కాలేదు. అదే 'గేమ్ చేంజర్'పై ఎక్కువ నెగిటివ్ ప్రభావం చూపింది.
'డాకు మహారాజ్' ఫస్టాఫ్‌లో 'హై'...
బాలయ్య లేటెస్ట్ హిట్ 'డాకు మహారాజ్'పైనా అదే కంప్లైంట్ వినిపిస్తోంది. ఫస్ట్ అఫ్ అంతా రేసీ స్క్రీన్ ప్లే తో పరుగులు పెట్టించిన బాబి టీం సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం దృష్టి పెట్టి ఉండాల్సిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సివిల్ ఇంజనీర్ సీతారామం 'డాకు మహారాజ్'గా మారే సీన్లు బాగానే ఉన్నా ఆ తర్వాత ఒకే తరహా ట్రీట్మెంట్‌తో ఆ పాత్ర సాగిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చాలా తక్కువ లెంగ్త్‌తో రిలీజ్ అయిన ఈ సినిమా సెకండాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపించడానికి ఇదే కారణం అంటున్నారు. సెకండాఫ్ సీన్లు ఇంకొంచెం టైట్ గా రాసుకొని ఉండి ఉంటే 'డాకు మహారాజ్' రేంజ్ మరింత పెరిగి ఉండేది అనేది బాలయ్య అభిమానుల నుంచి కూడా వినిపిస్తున్న మాట.
Also Read: మతాలు మార్చేస్తారు, సంబంధాలు కలిపేస్తారు... 'ఏఐ' (Artificial Intelligence)తో జాగ్రత్త
'సంక్రాంతి కి వస్తున్నాం'లో ఆ ఎపిసోడ్!
లేటెస్ట్ గా రిలీజ్ అయిన వెంకటేష్ - అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'పైనా అదే తరహా కంప్లైంట్ వినిపిసస్తోంది. అదిరిపోయే ఫస్టాఫ్‌కి సరిపడే స్థాయిలో సెకండాఫ్‌లో లేదని రివ్యూస్ వినబడుతున్నాయి. ఫస్టాఫ్‌లో పిల్లాడి కామెడీ ఒక రేంజ్ లో పేలితే సెకండాఫ్ కాస్త కంగాళీగా ఉందని అంటున్నారు. ఈ కంప్లైంట్ వాళ్ళిద్దరి గత చిత్రం "F3" పైనా వచ్చింది. అయితే వెంకటేష్ కు ఉన్న యూనివర్సల్ యాక్సెప్టెన్సీ, సంక్రాంతి పండుగ కలిపి సినిమాను హిట్ చేశాయి. కానీ అనిల్ రావిపూడి సెకండాఫ్ మీద కాస్త దృష్టి పెట్టి ఉంటే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా స్థాయి మరింత పెరిగి ఉండేదని చూసిన జనం అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా విచిత్రంగా సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలకి సెకండాఫ్ విషయంలో ఒకే విధమైన ఫీడ్ బ్యాక్ వినిపిస్తుండడం విశేషం.